తెరాస పార్టికి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదు..భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

ప్రజల్లో వ్యతిరేకతను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థులు దొరకని పరిస్థితి కనిపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ బొమ్మతో ప్రజల్లోకి వెళ్తే నిండా మునుగుతామని ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. ముందస్తుకు వెళితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మునిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గెలిచినా ఓడినా ఒరిగేదేమీ లేదంటూ తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు మునుగోడు ఎన్నికల బరి నుంచి ముందే పారిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో మీడియా ప్రతినిధులతో సంజయ్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
కమ్యూనిస్టులు తెరాస కోవర్టులు..
రాష్ట్రంలో కమ్యూనిస్టు, మజ్లిస్‌ పార్టీలు తెరాసకు అమ్ముడుపోయాయని, ఆ పార్టీల నాయకులు కేసీఆర్‌కు కోవర్టుల్లా మారారని సంజయ్‌ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులు పోటీచేసి తామేంటో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా తెరాసను ఓడించే సత్తా భాజపాకే ఉందని నమ్ముతున్నారని చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి తెరాస క్యాడర్‌లో కలవరం మొదలైందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయడానికి హైదరాబాద్‌లోని పలు కంపెనీల వద్ద నెల క్రితమే కేసీఆర్‌ డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. మునుగోడులో ఈనెల 21న జరిగే సభకు అమిత్‌షా హాజరుకానున్నారని సంజయ్‌ వెల్లడించారు…