నాగార్జున‌సాగర్‌లో బండి సంజయ్ పాదయాత్ర!

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలని చూస్తుంది…నాగార్జున సాగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ నాగార్జునసాగర్ ఉపఎన్నికపై కసరత్తు ప్రారంభించారు….. నల్లగొండ జిల్లా నేతలతో ఆయన హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో సమాలోచనలు చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో పాదయాత్ర చేసే యోచనలో బండి సంజయ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థి ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతోన్నారని సమాచారం. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాకే తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ కేటాయింపుపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. నాగార్జున సాగర్‌ బరిలో దిగేందుకు ఇద్దరు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్‌ని అంజయ్యయాదవ్‌ కలిశారు. తనకే టికెట్‌ కేటాయించాలని కోరినట్లు సమాచారం. అటు కంకణాల నివేదితారెడ్డి దంపతులు కూడా టికెట్‌ ఇవ్వాలని బండిసంజయ్‌ను కోరినట్లు తెలుస్తోంది.
కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జునసాగర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంపై దృష్టి సారించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి గత ఎన్నికల్లో నోముల నర్సింహయ్యపై పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా ఆయన్నే బరిలోకి దింపాలని నిర్ణయించింది. నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జానా‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అటు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నోముల నర్సింహయ్య సతీమణికే ఆ పార్టీ అధినేత ఛాన్స్ ఇస్తారా?… మరో లీడర్‌ను ఎంపిక చేస్తారా అనేది చూడాలి.