రాహుల్‌ను రాజీవ్‌గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని భాజపా ఎప్పుడైనా అడిగిందా అంటూ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ.

R9TELUGUNEWS.COM: రాహుల్‌ను రాజీవ్‌గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని భాజపా ఎప్పుడైనా అడిగిందా అంటూ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ.. మరుసటి రోజూ కాంగ్రెస్‌ నేతపై విరుచుకుపడ్డారు. రాహుల్‌ గాంధీని పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నాతో పోల్చారు. రాహుల్‌ వేర్పాటువాదిలా మాట్లాడుతున్నారని, ఆయన నేటితరం జిన్నా అంటూ వ్యాఖ్యానించారు. గువాహటిలో జరిగిన పార్టీ సమావేశంలో హిమంత మాట్లాడుతూ.. ‘రాహుల్‌ ఉపయోగించే భాష, ఆయన మాటలు 1947కు ముందు జిన్నా మాట్లాడినట్లుగానే ఉంటున్నాయి. రాహుల్‌ గాంధీ నేటితరం జిన్నా మాదిరి కనిపిస్తున్నాడు’ అని అన్నారు.
రాహుల్‌పై శుక్రవారం తాను చేసిన వ్యాఖ్యలపై హిమంతా ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ‘మన ఆర్మీ జవాన్లు శత్రు భూభాగంలో ఏదైనా చర్యకు వెళ్లడానికి నెల ముందు ప్లాన్ చేస్తారు. అవి వారి వ్యూహాత్మక చర్యలు. ఆపరేషన్, ఆ తర్వాత పత్రికా ప్రకటన అనంతరం ఈ చర్యల గురించి సమాజానికి తెలుస్తుంది. ఇలాంటి అంశాలపై రుజువులు అడిగితే.. ఆర్మీ జవాన్లు అనుభవించే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి’ అని అన్నారు. అందుకే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటూ.. ఇకపై ఆర్మీకి సంబంధించి ఎలాంటి ఆధారాలను కాంగ్రెస్‌ అడగబోదని ఎద్దేవా చేశారు.2016లో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై చేసిన మెరుపుదాడులకు సంబంధించి సాక్ష్యాలు చూపాలని అడగడం ద్వారా రాహుల్‌ సైనికుల వీరత్వాన్ని అనుమానించారంటూ హిమంత మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లో జరిగే ఎన్నికల కోసం భాజపా తరఫున శుక్రవారం ప్రచారానికి వెళ్లిన ఆయన దేహ్రాదూన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాహుల్‌ను రాజీవ్‌గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని భాజపా ఎప్పుడైనా అడిగిందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.