ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ సర్కారు కూలిపోవడం ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.

కేసీఆర్ బీజేపీ మీద ఉన్న కోపాన్ని రైతుల మీద చూపెడుతున్నారని, ధాన్యం సేకరణకు డబ్బులన్ని కేంద్రమే ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీగా మాత్రమే పనిచేస్తుందని, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం రంగంలో దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ కొత్తగా వచ్చింది కాదు దశాబ్దాలుగా కొనసాగుతుందని, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాక పంట పెరిగిందన్నారు. ఫుడ్ కార్పొరేషన్ రెండు విధానాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, డీసీపీ పద్ధతిని తెలంగాణ రాష్ట్రం ఎంచుకుని ధాన్యాన్ని ఇస్తుందని, ముందు చూపు లేక చిన్న చూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. పార్టీ ఆఫీసుల మీద దాడులు, ధర్నాలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితుల్లో ఉందని ఈటల వాపోయారు. కేసీఆర్ సర్కారుకు ముందు చూపులేక, చిన్న చూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందని విమర్శించారు.
వడ్లు పండించి పార్టీ కార్యాలయం, ఇళ్ల ముందు పోస్తామని కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, వరి వేయవద్దంటే.. రైతుల పరిస్థితి ఏమి కావాలన్నారు. కోటి ఎకరాల్లో పంట పండిస్తే కేసీఆర్ ఎక్కడ అమ్ముకుంటావు అని, తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అంటివి కేసీఆర్ ఏమైందని ఆయన మండిపడ్డారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎక్కడా చెప్పలేదని, ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం తెలంగాణ బీజేపీ కృషి చేస్తోందని, జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు బిల్లు కేంద్రానికి పంపిన మాట వాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీలో ఈటల వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.