బి.జె.పి లోకి సీనియర్ హీరోయిన్ జయసుధ..!

తెలంగాణలో పార్టీలో మధ్య చేరికల రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. ఏ పార్టీలో ఎక్కువ మంది నేతలు చేరితే ఆ పార్టీ పై చేయి సాధించిందనే భావన కలుగుతుండటంతో అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ కలవడం సంచలనంగా మారింది. దీంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. 2009లో కాంగ్రెస్ నుండి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పని చేసిన జయసుధ.. అనంతరం రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.

ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరుతారనే ప్రచారం గతంలోనూ జరిగింది. అనూహ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ జయసుధ పేరు మరోసారి తెరమీదకు వస్తోంది. ఈ మేరకు కిషన్ రెడ్డితో పార్టీలో చేరే విషయం చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని.. అయితే బీజేపీ హైకమాండ్ నుండి స్పష్టమైన హామీ కావాలనే షరతు పెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి జయసుధకు బీజేపీ పెద్దల నుండి ఎటువంటి హామీ లభించబోతున్నదనే ఆసక్తిగా మారింది.