తెలంగాణ బిజెపి నేతలకు కేంద్రం భద్రత కేటాయింపు..!

తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్ ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్‌ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటలకు ‘వై’ ప్లస్ భద్రతను కేటాయించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మందితో భద్రతా సిబ్బంది రక్షణగా ఉండనున్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అర్వింద్‌కు సెక్యూరిటీగా ‘వై’ కేటగిరీలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. ఈరోజు సోమవారం ఈటల, అరవింద్ నివాసాలకు కేంద్ర భద్రతా బలగాలు వెళ్లనున్నారు.