కొత్త నియామకాల పద్ధతి యువతకు బంగారంలాంటి అవకాశం..రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌..

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు స్పందించారు. కొత్త నియామకాల పద్ధతి యువతకు బంగారంలాంటి అవకాశం అని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. త్వరలోనే అగ్నిపథ్‌ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వెంటనే యువత అందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కొత్త పద్థతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వరుసగా మూడోరోజూ నిరసనలు కొనసాగుతున్న వేళ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం దేశ రక్షణ వ్యవస్థలో భాగం కావడానికి, దేశ సేవ చేయడానికి యువతకు ఒక బంగారంలాంటి అవకాశం. గత రెండేళ్లలో నియామకాలు చేపట్టని కారణంగా సైన్యంలో చేరాలనుకున్నవారికి అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్నివీరుల నియామకానికి ఈ ఏడాది వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. ఈ మినహాయింపు ఒకసారికి మాత్రమే. దీనివల్ల అనేక మంది అగ్నివీరులుగా మారేందుకు అర్హత లభిస్తుంది. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రికి యువకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే యువకులంతా అందుకు సన్నద్ధం కావాలని కోరుతున్నాను’’ అని రాజనాథ్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా; రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వయోపరిమితిని పెంచారని షా తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ సేవ చేసి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్న యువకులకు లాభం చేకూరనుందని వ్యాఖ్యానించారు. యువశక్తి సాధికారతే ప్రధాని మోదీ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని గడ్కరీ తెలిపారు. ఓవైపు కొత్త విధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతుంటే మరోవైపు కీలక మంత్రులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అల్లర్లు, నిరసనల పరిగణనలోకి తీసుకోకుండానే అగ్నిపథ్‌ను సమర్థించడం గమనార్హం.