మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేసిన ఎంపీ…

మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో బాలికల పాఠశాలను పరిశీలించిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా
మరుగుదొడ్డి మురికిగా ఉండటంతో స్వయంగా శుభ్రం చేసిన వైనం..

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మాత్రం ఓ పాఠశాలలో మరుగు దొడ్డిని శుభ్రం చేశారు. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలోని బాలికల పాఠశాలలో మురికిగా ఉన్న మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేసిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఎంపీ షేర్ చేశారు. బీజేపీ యువమోర్చా సేవా పఖ్‌వాడా ప్రచారంలో భాగంగా ఎంపీ ఖత్ఖారీ బాలికల పాఠశాలను సందర్శించారు.

ఈ సమయంలో పాఠశాలలో మరుగు దొడ్డి మురికిగా ఉన్న విషయం గమనించారు. వెంటనే మరో ఆలోచనే లేకుండా దాన్ని శుభ్రం చేశారు. సేవా పఖ్‌వాడా ప్రచారంలో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించినట్టు ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తను మరుగుదొడ్డిని శుభ్రం చేయడం పెద్ద విషయమేమీ కాదని ఎంపీ అన్నారు. ‘నేను పాఠశాలను సందర్శించినప్పుడు టాయిలెట్ మురికిగా కనిపించింది. అందుకే దాన్ని శుభ్రం చేశాను.
ఇది పెద్ద విషయమేమీ కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.