అసలు దొంగలను వదిలేసి, ఆధారాలు ఇచ్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారా.బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు….!!!

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తూనే ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు విషయంలో మాత్రం పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. కేసుకు సంబంధించి వీడియోలు బహిర్గతం చేసిన వాళ్లపైనా కేసులు పెడుతున్నారు పోలీసులు. మైనర్ బాలిక కారులో నిందితులతో కలిసి ఉన్న వీడియోలను వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన మీడియా ప్రతినిధి సుభాన్ ను అరెస్ట్ చేశారు. రెండు యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని ఆరోపిస్తూ.. అందుకు కొన్ని ఆధారాలు విడుదల చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మైనర్ బాలికతో పాటు నిందితులు కలిసి ఉన్న కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు..మైనర్ బాలిక ఫోటోలు, వీడియో రిలీజ్ చేయడం నేరమంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఆబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన పోలీసులు రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులపై కేసులు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని సంజయ్ ఆరోపించారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు ఇచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని ఆరోపించారు…