పంజాబ్‌ పురపోరు: భాజపాకు ‘సాగుచట్టాల’ షాక్‌…

*పంజాబ్‌ పురపోరు: భాజపాకు ‘సాగుచట్టాల’ షాక్‌*

*క్లీన్‌స్వీప్‌ చేసిన కాంగ్రెస్‌*

స్నేహ,చండీగఢ్‌: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్‌ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో భాజపాకు గట్టి షాక్‌ తగిలింది. అక్కడి పురపాలక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓటమి చవిచూసింది. మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 7 చోట్ల కాంగ్రెస్‌ నెగ్గింది. మరోచోట ఫలితం రేపు వెలువడనుంది. అయితే ఈ ఫలితాల్లో భాజపా రెండో స్థానంలోనూ నిలువలేకపోయింది.

రాష్ట్రంలోని మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో గల 2,302 వార్డులకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటివరకు వెలువడిన సమాచారం ప్రకారం.. అబోహర్‌, బటిండా, కపూర్తల, హొషియార్‌పుర్‌, మోగ మున్సిపల్‌ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మరో రెండు కార్పొరేషన్లు బటాలా, పఠాన్‌కోట్‌ల‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. నగర పంచాయతీల్లోనూ చాలా చోట్ల కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా.. శిరోమణి అకాళీదళ్‌, ఆమ్‌ఆద్మీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భాజపా నాలుగో స్థానానికి పడిపోయింది.

మొహాలీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అక్కడ మంగళవారం రీపోలింగ్‌ నిర్వహించారు. దీంతో ఈ కార్పొరేషన్‌లో రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

*53ఏళ్ల తర్వాత అక్కడ కాంగ్రెస్‌ మేయర్‌*

బటిండా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. 53ఏళ్లలో తొలిసారిగా ఇక్కడ మేయర్‌ పదవిని దక్కించుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు 43 స్థానాలు రాగా.. శిరోమణి అకాలీదళ్‌ 7 చోట్ల గెలుపొందింది. దీంతో మేయర్‌ పదవి హస్తం పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్ర మంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఫొటోలు పంచుకున్నారు.