బట్టతల బాధితుల సంఘం డిమాండ్.. చిత్రంగా ఉన్నది…

బట్టతల బాధితుల సంఘం డిమాండ్..

సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో బట్టతల బాధితుల సంఘం వారు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా తమ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బట్టతల బాధితుల సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా వెళ్ది బాలయ్యను ఎన్నుకున్నారు. ఇక ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోశాధికారిగా రాము ఎన్నికయ్యారు. బట్టతల బాధితుల సంఘ మొట్టమొదటి అధ్యక్షునిగా బాలయ్య..ఈ ఎన్నిక అనంతరం బట్టతల బాధితుల సంఘ అధ్యక్షుడు బాలయ్య మాట్లాడుతూ..తమను కూడా మానసిక వికలాంగుల కింద పరిగణించాలని సీఎం కేసీఆర్ ను కోరారు. సమాజంలో బట్టతల ఉన్న వారు అనేక ఇబ్బందులను గురవుతున్నారు. అందుకే ప్రభుత్వం స్పందించి సంక్రాంతి పండుగ లోపు రూ.6000 పెన్షన్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం అన్నారు. ప్రస్తుత సమాజంలో బట్టతలతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిని ఈ సమస్య వేధిస్తుంది. ఇక బట్టతలతో ఇబ్బంది పడుతున్న యువకుల బాధ వర్ణనాతీతం. ఈ సమస్యతో బాధపడుతున్న వారు నలుగురిలో కలవడానికి జంకుతున్నారు. బట్టతల సమస్య మానసికంగా వారిని కుంగదీస్తుంది. ఈ క్రమంలోనే వారు ఫించన్ డిమాండ్ ను లేవనెత్తారు. మరి వీరి డిమాండ్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.