బూస్టర్‌ డోస్‌గా నాసల్‌ వ్యాక్సిన్‌ రక్షణ..!!..

ప్రముఖ పార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన యాంటీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఫేజ్‌-3 ట్రయల్స్‌ కోసం డీసీజీఐ (ఫార్మాస్యూటికల్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)కి దరఖాస్తు చేసింది. బూస్టర్‌ డోస్‌గా ఈ టీకాను కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారికి ఇవ్వొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. దేశంలోనూ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. మరో వైపు వచ్చే ఏడాది జనవరిలో థర్డ్‌ వేవ్‌ ప్రారంభమై.. ఫిబ్రవరి వరకు భారీగా కేసులు పెరుగుతాయని నిపుణులు అంచనా వేయగా సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి నాసల్‌ వ్యాక్సిన్‌ రక్షణ అందిస్తాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి.వ్యాక్సిన్లను మెరుగుపరచొచ్చు
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ల నుంచి రక్షణ అందించేందుకు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లలో కొన్ని మార్పులు చేయొచ్చని ఢిల్లీకి చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (AIIMS) డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. ఒమిక్రాన్‌ ముప్పు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయన్న ఆయన.. కొత్త వేరియంట్ల విషయంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందన్నారు…నాసల్‌ వ్యాక్సిన్‌ ప్రభావంతం..నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సార్స్‌-కోవ్‌-2 వంటి అనేక వైరస్‌లు సాధారణంగా శ్లేష్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముక్కు నుంచి వ్యక్తికి వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే ముందే నిర్మూలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. నాసికా వ్యాక్సిన్‌ ఇమ్యునోగ్లోబులిన్‌ A (IgA)ను ఉత్పత్తి చేస్తుందని, ఇది వైరస్ ప్రవేశించిన ముక్కులోనే బలమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ద్వారా వైరస్‌ను నిరోధించగలదని.. వైరస్‌తో పోరాడానికి సహాయపడడంతో పాటు వైరస్‌ వ్యాప్తిని సైతం నిరోధిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. నాసల్‌ వ్యాక్సిన్‌ టీకాలు బలమైన, సమర్థవంతమైన శ్లేష్మ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయని అంటున్నారు.