నదిలో పెళ్లి ‘బోటు’ బోల్తా.. 100 మంది మృతి.. అనేక మంది గల్లంతు…

*నదిలో పెళ్లి ‘బోటు’ బోల్తా.. 100 మంది మృతి.. అనేక మంది గల్లంతు*

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఓ పడవ క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిపై బోల్తా పడిన ఘటనలో 100 మంది మరణించగా అనేక మంది గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నీటిలో మునిగిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులు పెళ్లికి వెళ్లి వస్తుండగా జరిగిందీ దుర్ఘటన. పడవలో మహిళలతో పాటు పిల్లలు కూడా ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు.

బాధితులు నైజర్ రాష్ట్రంలోని ఎగ్బోటి గ్రామంలో ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. అనంతరం తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లే క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నైజర్ నదిలో బోటు బోల్తా పడిందని తెలిపారు. పడవ ప్రమాద సమయంలో పడవలో వంద మందికి పైగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి కొన్ని నదిలో మునిగిపోయిన కొన్ని మృతదేహాలను వెలికితీశామని పోలీసులు తెలిపారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ సహాయక చర్యల్లో స్థానికులు కూడా పోలీసులకు సాయం చేస్తున్నారు.