ఏప్రిల్‌ మొదటివారంలో నల్లగొండ జిల్లాలో కేసీఆర్‌ పొలం బాట..!

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు, వారిలో మనోధైర్యం నింపేందుకు పొలం బాట పట్టనున్నారు అని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.. ఇటీవల నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఏప్రిల్‌ మొదటివారంలో నల్లగొండ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్పన్నమైన నీటి ఎద్దడి సమస్య కారణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయనే అంచనాలు ఉన్నాయి. ఒకవైపు సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే, మరోవైపు ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాల సందర్శన కార్యక్రమం చేపట్టగా, కేసీఆర్‌ కూడా స్వయంగా రైతుల వద్దకు వెళ్లనున్నట్టు సమాచారం. ఏప్రిల్‌ మొదటి వారంలో ఈ పర్యటనలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించేవిధంగా పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ యాత్ర మొదలు పెట్టనున్నారు. అక్కడి నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టివచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్‌ పర్యటన కోసం అక్కడి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. తేదీలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం.కాంగ్రెస్‌ నాలుగు నెలల పాలనలోనే దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు ఎవ్వరూ స్వయంగా పంట నష్టాన్ని పరిశీలించి, భరోసా కల్పించడం లేదన్న ఆవేదన రైతుల్లో గూడుకట్టుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయంగా గేట్లు ఎత్తడంపైనే దృష్టి పెడుతున్నారని, ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, నీటి నిర్వహణపై దృష్టి పెట్టడంలేదని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఎండిపోయిన పొలాలు, వడగండ్ల వర్షాలకు నష్టపోయిన పొలాలకు ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు వేసుకుంటున్నారని, అవి సక్సెస్‌ కాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతులు అప్పుల పాలవుతున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడంలేదని, మోటర్లు కాలిపోతున్నాయని, ఇది మరో రకంగా రైతులకు భారంగా మారుతున్నదని, ఈ దుస్థితికి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. రైతులకు మనోధైర్యం కల్పించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి కేసీఆర్‌ రంగంలోకి దిగిస్వయంగా రైతుల వద్దకు వెళ్లనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాడుతుందని ధైర్యం నింపనున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ‘చలో సచివాలయం’ పిలుపునివ్వాలని నిర్ణయించారు..