బీఆర్ఎస్‌కు షాక్..మంద జగన్నాథం..బీఆర్ఎస్‌కు గుడ్ బై.!!!

బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సొంతగూటికి చేరుకోనున్నారు మందా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రత్యేకంగా నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో ఆయనకు మంచి పట్టు ఉంది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా పనిచేశారు.

నాగర్ కర్నూల్ నుండి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు మందా. 1996 తర్వాత 1999, 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో మంద జగన్నాధం విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో తొలిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నంది ఎల్లయ్య విజయం సాధించారు.

సరిగ్గా వారం రోజుల క్రితం మంద జగన్నాథంతో ఏఐసీసీ సెక్రటరీ, ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్‌తో భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోగా కొంతకాలంగా బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న మందా పార్టీ మారడం ఖాయమని అంతా భావించారు. అయితే ఆయన్ని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ కీలక నేతలెవరూ ప్రయత్నం చేయకపోవడంతో మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం .మందా జగన్నాథంతో పాటు ఆయన తనయుడు మంద శ్రీనాథ్, అలాగే ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి సైతం బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.