*_కక్షపూరితంగానే ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారు !.
హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏం తప్పు చేశానని టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉరి తీసేవాడిని కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారని అన్నారు. మరో పది రోజులు వేచి చూస్తానని.. అధిష్టానం నుంచి పిలుపు రాకపోతే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు..తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంతో ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. 2001 నుంచి ఉద్యమకారుడిగా పనిచేశానని.. జూన్ 26 నాడు పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పారు. ఉప్పల్‌లో జెండా పట్టిన మొదటి నాయకుడిని తాను అని.. తనకు తెలిసిన పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్నానని.. 2008 నుంచి ఉప్పల్ ఇంఛార్జీగా ఉన్నానని తెలిపారు. ఉద్యమ సమయంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదన్నారు. ఉద్యమ సమయంలో బంద్‌కు పిలుపునిస్తే రాత్రి వచ్చి పోలీసులు తీసుకుపోయే వారని గుర్తు చేసుకున్నారు.2014లో కేసీఆర్ టికెట్ ఇచ్చారు. అప్పుడు ఓడిపోయినా నన్ను ప్రోత్సహించి పనిచేయమన్నారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 10 సీట్లకు 9 సీట్లు గెలుచుకున్నాం. ప్రతీ రోజు జనంలోనే ఉన్నాను. పార్టీలకతీతంగా నేను పనిచేశాను. ఉప్పల్ టికెట్ వేరే వారికి ఇచ్చారు. అతను పార్టీకి ఏమి చేశాడు. అప్పుడు కాంగ్రెస్-టీడీపీ పొత్తులో సీటు పోతే బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఎల్ఆర్. సీఎస్ఆర్ డబ్బులను బీఎల్ఆర్ ట్రస్ట్ పేరుతో పంచుతున్నారు తప్ప పార్టీకి ఏమి చేయలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 29 నియోజకవర్గాల్లో నేను, పద్మారావు మాత్రమే ఉద్యమకారులం..నేను ఏం తప్పు చేశానని టికెట్ ఇవ్వలేదు. పార్టీలో ఉద్యమకారులు ఉండకూడదా..? టికెట్లు ప్రకటించి వారమైన నాకు పై నుంచి పిలుపు రాలేదు. మా కార్యకర్తలు అడుగుతున్నారు. నాకు అధిష్టానం ఏమి చెప్పనిది.. కార్యకర్తలకు ఏమి చెప్పాలి. నన్ను ఎందుకు బలి చేశారో తెలియడం లేదు. జూన్ 15న మంచిగా పని చేసుకో అని పార్టీ చెబితే పాదయాత్ర చేశాను. 30 రోజుల పాదయాత్రలో ఎవరు నన్ను అడ్డుకోలేదు. కొన్ని చోట్ల మంత్రులను కూడా అడ్డుకున్నారు. టికెట్ రాకున్నా కార్యకర్తలను సంయమనం పాటించాలని అన్నాను. ఉరి తీసేవాడిని కూడా ఆఖరి కోరిక అడుగుతారు..” అని భేతి సుభాష్ రెడ్డి అన్నారు…ఎమ్మెల్యే అయిన తర్వాత తన ఆస్తులు అమ్ముకున్నానని ఆయన చెప్పారు. ఇంకా వేచి చూస్తున్నాననని.. మార్పులు జరుగుతున్నాయని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానం తనను కలవకపోవడానికి కారణం ఏమిటి..? అని ప్రశ్నించారు. వారం పది రోజులు వేచి చూస్తానని.. తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తాను ప్రజల కోసం పనిచేస్తానని.. ప్రజల ఆలోచనా మేరకే పని చేస్తానని స్పష్టం చేశారు…