బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 39 ముక్కలు విభజిస్తాం.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పై, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు..లండన్ లో తమ ముఖ్యమంత్రి చెప్పినట్టే ఆ పార్టీకి బొందపెడతామని మరోసారి ఘాటుగా మాట్లాడారు. తమ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని ప్రతిపక్షాలు కలలు కంటున్నాయని, కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ నే తాము విభజిస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను 39 ముక్కలుగా విభజిస్తామన్నారు కోమటిరెడ్డి. ఆ పార్టీని 14 ముక్కలు చేస్తామన్నారు…

యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సమీక్ష అనంతరం ఆ వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజకీయ వ్యాఖ్యలతో కలకలం రేపారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారాయన.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకున్న అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అన్నారాయన. గత ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, పేదల భూములు లాక్కుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ గాడిలో పడుతోందన్నారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారిక కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యలేంటని ప్రశ్నిస్తున్నారు. లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసందర్భం అని అంటుంటే.. వాటిని సమర్థిస్తూ కోమటిరెడ్డి మాట్లాడటం మరింత శోచనీయం అని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు..