కరీంనగర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం.. ఈ నెల 12 న భారీ బహిరంగ సభ!..

భారత రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ గారు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రచారం లో భాగంగా రోడ్‌షోలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో ఆయన స్వయంగా పాల్గొననున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలోనూ పార్టీ సమావేశాలు పెట్టాలని నేతలకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలతో భేటీ అనంతరం కేసీఆర్‌.. పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.