కాంగ్రెస్‌ గేట్లు తెరిస్తే అక్కడికి గొర్రెలు వెళ్లాయి.భారాస గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…

కాంగ్రెస్‌ గేట్లు తెరిస్తే అక్కడికి గొర్రెలు వెళ్లాయని… అదే భారాస గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయని నాగర్‌కర్నూల్‌ భారాస లోక్‌సభ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు..నిజమైన తెలంగాణ ఇక్కడ ఉంటే.. తెలంగాణను మోసం చేసిన వాళ్లు అక్కడ ఉన్నారని విమర్శించారు. ఉద్యమాన్ని తాకట్టు పెట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్లందరూ అక్కడికి గేట్లు తోసుకుని పోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేతలు శనివారం భారాసలో చేరారు. పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడారు. ‘చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్‌ విముక్తి కల్పించారు. అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసింది. రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలైన ఈడీ, సీబీఐ అన్నిటినీ మోదీ గుప్పెట్లో పెట్టుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. అప్పుడు బహుజనులకు రిజర్వేషన్లు ఉండవు.. దళిత బిడ్డల బతుకులు ప్రమాదంలో పడతాయి. భాజపా, కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా మన పోరాటం ఆగదు’ అని ప్రవీణ్‌ పేర్కొన్నారు.