అయోధ్యకు వెళితే బీజేపీలో చేరుతున్నట్టా.. నేనేంటో నా పార్టీకి తెలుసు..మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్..

బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యకు వెళితే బీజేపీలో చేరుతున్నట్టా అని ప్రశ్నించారు. తానేమిటో తమ పార్టీకి తెలుసునని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. స్వలాభం గురించి కొంతమంది పార్టీ విడుతున్నారని విమర్శించారు..కాగా, శ్రీనివాస్ గౌడ్ తమ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిన్న స్పందించారు. మహబూబ్ నగర్ అభ్యర్థిగా ఉన్న తనను సంప్రదించకుండా ఆయన్ను బీజేపీలో చేర్చుకుంటారా అని ప్రశ్నించారు. పార్టీలో చేరమని తాము ఎవరినీ రమ్మని అడగలేదని అన్నారు.

కవిత అరెస్ట్‌ను ఖండిస్తున్నాం..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని, దీన్ని ఖండిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లక్షల కోట్లు మింగిన వాళ్ళు విదేశాల్లో ఉన్నారని.. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందన్నారు. పాలకులు పారదర్శంగా ఉండాలని, ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చక పోతే మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు..