బీఎస్‌ఎన్‌ఎల్‌ను బతికించండి! కేంద్ర మంత్రికి సంస్థ ఉద్యోగుల వినతి..

ప్రైవేటు టెలికం సంస్థలు హైస్పీడ్‌ 5జీ సేవలిస్తుంటే, బీఎస్‌ఎన్‌ఎల్‌ కనీసం 4జీ సేవలు కూడా ఇవ్వక పోవడంతో పోటీని తట్టుకోలేక పోతున్నదని, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి గోడు వెళ్లబోసుకుంది. రోజు రోజుకూ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు ఇతర కంపెనీల సేవలకు వెళ్లిపోతున్నారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే బీఎస్‌ఎన్‌ఎల్‌ మూతపడిపోతుందని యూనియన్‌ నాయకులు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ప్రైవేట్‌ టెలికం కంపెనీలు ఒకవైపు 5జీ హై-స్పీడ్‌ డేటా సేవలందింస్తుంటే, బీఎస్‌ఎన్‌ఎల్‌ కనీసం 4జీ సేవలు కూడా అందించటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ద్వారా 4జీ పరికరాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పినా, దాని అమలులో ఎంతో జాప్యం జరుగుతున్నదన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా రాబోయే రెండు వారాల్లో 4జీ సేవలు, డిసెంబర్‌ నాటికి 5జీ సేవలందిస్తామని గతేడాది మే నెలలో మంత్రి చేసిన ప్రకటనను కూడా యూనియన్‌ తన లేఖలో ఉటంకించింది. ఇంతవరకు 4జీ సేవలపై టీసీఎస్‌ క్షేత్ర స్థాయిలో ట్రయల్స్‌ కూడా పూర్తి చేయలేదని, అలాంటి పరిస్థితుల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా 4జీ, 5జీ సేవలు అందించడానికి మరెంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని యూనియన్‌ పేర్కొంది._

*ప్రతి నెలా లక్షల్లో వలస వెళ్తున్న కస్టమర్లు*

_టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) గణాంకాల ప్రకారం 2023 ఆగస్టులో బీఎస్‌ఎన్‌ నుండి ఇతర నెట్‌వర్క్‌లకు వలస వెళ్ళిన కస్టమర్ల సంఖ్య 22,20,654 మంది కాగా, సెప్టెంబర్‌లో ఆ సంఖ్య 23,26,751 కి పెరిగింది. 2022 నుంచి దాదాపు 77 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ టీసీఎస్‌ ద్వారా 4జీ నెట్‌వర్క్‌ పరికరాల ఏర్పాటు పనులు అక్టోబర్‌ 2024లోగా పూర్తవుతాయని చెప్తున్నారని, ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వైష్ణవ్‌ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు 4జీ, 5జీ సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని, లేని పరిస్థితుల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ మూసివేసే పరిస్థితులు ఏర్పడతాయని యూనియన్‌ కోరింది.ఇప్పటికే ఉన్న 4జీ అనుకూల పరికరాలను అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రభుత్వం నిరాకరించడం, ప్రపంచ విక్రేతల నుంచి 4జీ పరికరాల కొనుగోలులో ప్రైవేటు టెలికం కంపెనీలతో సమానంగా లేకపోవడం బీఎస్‌ఎన్‌ఎల్‌ దుస్థితికి కారణమని యూనియన్‌ తెలిపింది._