నేడే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. రాజకీయ తీర్మానాలపై సర్వత్రా ఆసక్తి
ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాల బీఆర్‌ఎస్ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా పార్టీ ప్రజాప్రతినిధులతో ప్లీనరీ నిర్వహించే బీఆర్‌ఎస్ ఈ ఏడాది సాధారణ సమావేశానికే పరిమితం చేయాలని నిర్ణయించింది. వేసవి తీవ్రత, అనావృష్టి, అకాల వర్షాలు తదితర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ సుమారు 6 వేల మంది ప్రతినిధులతో బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలి దర్శన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తొలుత భావించినా సాధారణ సభకే పరిమితమైంది. బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా శాఖల అధ్యక్షులతో పాటు మొత్తం 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు..