సీఏఏకు పోర్టల్‌.. ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం..

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది..బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణ కోసం మంగళవారం పోర్టల్‌ను ప్రారంభించింది. అర్హులైన వారు indiancitizenshiponline.nic.in. పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. త్వరలోనే ‘సీఏఏ-2019’ పేరిట మొబైల్‌ అప్లికేషన్‌ కూడా అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు. సీఏఏపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లింలకు కేంద్ర హోం శాఖ భరోసా ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌ ప్రభావం వారి పౌరసత్వంపై పడుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది…

సీఏఏను తమ రాష్ట్రంలో అమలుచేయబోము..

తమిళనాడు, బెంగాల్‌ సీఎంలు స్టాలిన్‌, మమతాబెనర్జీ స్పష్టంచేశారు. సీఏఏ నిబంధనలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రజల్లో విభజన తేవడానికి తప్ప దీని వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని స్టాలిన్‌ విమర్శించారు. బహుళత్వం, లౌకికవాదం, మైనారిటీ వర్గాలు, శ్రీలంక తమిళ శరణార్థులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని అమలు చేయబోమని తెగేసి చెప్పారు. సీఏఏ నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని మమతాబెనర్జీ పేర్కొన్నారు. దీనికి దరఖాస్తు చేసే ముందు ప్రజలు పలుమార్లు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు..