సెలబ్రిటీలకు తప్పని కష్టాలు…ఇప్పుడంతా అదే మోజు..!

*సెల్ఫీ క్లిక్….భలే కిక్*

*ఇప్పుడంతా అదే మోజు*

*సెలబ్రిటీలకు తప్పని కష్టాలు*

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఎవరూ ఈ సెల్ఫీ ఫోటోలకు అతీతులు కాదు. అసలు ఈ సెల్ఫీలకు అంత క్రేజీ తీసుకొచ్చిందే వీరు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సెల్ఫీ జోరే కనిపిస్తుంది. మన ఫోటో ఎవరో తీస్తే చూసుకోవడం పాత పద్ధతి. టెక్నాలజీ పెరిగి సామాన్యుల చేతికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేయడంతో సెల్ఫీ క్లిక్ ఎంతో కిక్ ఇస్తుంది. అందుకనే అందరూ సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి తహతహలాడుతున్నారు. అలా సెల్ఫీ ఫోటోలు తీయడం క్షణాల్లో వాట్స్ అప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసి సంబర పడిపోవడం ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. ఎవరు ఫోన్లతో వారే సెల్ఫీలు తీసుకుని మురిసిపోతున్నారు.ఇటీవలి తెలుగుదేశం పార్టీ నాయకులు సెల్ఫీ చాలెంజ్ ఫొటోలు అనే కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

సెలబ్రిటీలకు సెల్ఫీ కష్టాలు..

సెలబ్రిటీలకు ఇప్పుడు సెల్ఫీ కష్టాలు వచ్చి పడ్డాయి. ఇప్పటివరకు వారితో ఎన్నో ఫోటోలు తీయించుకున్న వారు సైతం ఎప్పటికప్పుడు లేటెస్ట్‌గా సెల్ఫీ తీయించుకోవడంతో వారంతా ఇబ్బందులు గురవుతున్నారు.రాజకీయ నాయకులకే కాదు సినీ ప్రముఖులకు ఈ సెల్ఫీ సమస్య మరింత అధికంగా ఉంది. ఎందుకంటే ఏదో సెలబ్రిటీ పక్కన నిలిబడితే ఎవరో ఫోటో తీస్తే అదే ఫోటో కాదనట్లు నేటి యువతరం భావిస్తుంది. వారి ప్రక్కన నిలబడి సెల్ ఫోన్ లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ ఫోటో తీయించుకుంటేనే అసలు సిసలైన ఫోటోగా గుర్తిస్తున్నారు. అందువల్ల సెల్ఫీ ఫోజులు ఇవ్వలేక తెగ సతమతమవుతున్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలు వంటివారు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సెల్ఫీల భాద తప్పడం లేదు. కాదూకూడదని ముందుకు వెళుతుంటే పొగరు పెరుగు పోయిందని ఆ నాయకులు నిందలు మోయాల్సి వస్తుంది.అంతే పరిచయం లేని వ్యక్తితో సెల్ఫీ దిగితే ఆతరువాత ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేసి పట్టుబడితే అప్పుడు ఆ నాయుడుతో సంబంధం ఉందంటూ మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవడం పరిపాటైంది.

సెల్ఫీ ఎంతో మధురం…

తనకు తానుగా చూసుకుంటూ ఫోటో తీసుకుంటే అంతకంటే ఆనందం ఏముటుంది అంటున్నారు నేటి యువత. అందుకనే స్నేహితులతోనైనా, కుటుంబ సభ్యులతోనైనా ఈ సెల్ఫీ ఫోటోలు తీయించుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ గా మారిపోయింది. దశాబ్దం క్రితమే ఈ సెల్ఫీ ఫోటోలు అందుబాటులోకి వచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో అంతా సెల్ఫీ మయంగా మారింది. వివాహాది శుభకార్యాలకు వెళితే అక్కడంతా సెల్ఫీల సందడే కనిపిస్తుంది. గతంలో ఎవరితోనైనా ఫొటో తీయించుకోవాలంటే తీసేవారి కోసం ఎదురు చూడాల్సి వచ్చేది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

సెల్ఫీల పిచ్చిలో పొంచివున్న ప్రమాదాలు

సెల్ఫీల మోజు పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి ఒక్కొక్క సందర్భాలలో ప్రాణాలు కూడా తీస్తున్నాయి. రైల్వే ట్రాక్ పై నిలబడి సెల్ఫీ ఫొటోలు తీసుకోవడం, కొందరు నదులు,సముద్రాల లోకి దిగి మరికొందరు కొండలు, చెట్లు ఎక్కి సెల్ఫీ ఫొటోలు తీసుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతున్నారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ లో బోగి పైకెక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో విద్యుత్ షాక్ ‌కు గురై మృతి చెందిన సంఘటన తెలిసిందే. అందువల్ల సెల్ఫీలు తీయించుకునే మోజులో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సివుంది…