సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక కలత చెందిన బాలిక..90 అడుగుల ఎత్తు నుండి జలపాతంలొకి దుకి ఆత్మహత్యాయత్నం..!!

రాయ్‌పుర్: ఫోన్ వాడకం విషయంలో తల్లిదండ్రులు మందలించారని ఓ బాలిక జలపాతంలో దూకేసింది. ఆవేశంలో 90 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాకు చెందిన చిత్రకోట్ జలపాతం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఫోన్‌ వాడే విషయంలో తల్లిదండ్రులు సదరు బాలికను మందలించారు. దాంతో మనస్తాపం చెందిన ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. తర్వాత ఆమె ఇంటికి దగ్గర్లోని చిత్రకోట్‌ జలపాతం వద్దకు చేరుకుంది. కొద్దిసేపు జలపాతం అంచున నిల్చొని అటూఇటూ తిరిగింది. అక్కడే ఉన్న కొందరు పర్యాటకులు దూరంగా జరగాలంటూ ఆమెను హెచ్చరించారు. వారి మాటలను పట్టించుకోని ఆమె.. ఒక్క ఉదుటున నీటిలోకి దూకేసింది. ఆ దగ్గర్లోని వారు ఆ దృశ్యాలను రికార్డు చేయగా.. అవి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అదృష్టవశాత్తూ ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. తర్వాత పోలీసులు ఆ బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

చిత్రకోట్ జలపాతం ప్రకృతి అందాలకు నెలవు. అక్కడకు నిత్యం పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలం ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంద్రావతి నదిపై ఉన్న ఈ జలపాతాన్ని మినీ నయాగరా ఫాల్స్‌గా పిలుస్తారు.