ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై దర్యాప్తులో భారత్‌ సహకరించాలి..కెనడా రక్షణ మంత్రి బిల్‌ బ్లెయిర్‌ ..

భారత్‌ తమ పౌరులకు వీసాలు నిలిపివేయడం సహా తీసుకున్న చర్యలు ఆందోళనకరమని కెనడా రక్షణ మంత్రి బిల్‌ బ్లెయిర్‌ అన్నారు.ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై దర్యాప్తులో భారత్‌ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా నిజాలను వెలికితీసేందుకు, ఈ వివాదాన్ని సరైన పద్ధతిలో పరిష్కరించుకునేందుకు కలిసిరావాలని కోరారు. కెనడా జాతీయ టీవీ చానల్‌ ‘సీబీసీ’తో పాటు ‘ది వెస్ట్‌ బ్లాక్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వీరికి భారత్‌తో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని పేర్కొంటూ వీసాలు నిలిపివేయడం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. భారత్‌తో సంబంధాలు ముఖ్యమని చెబుతూనే నిజ్జర్‌ హత్య విషయంలో ఆరోపణలు నిజమని తేలితే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇది తమ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, పౌరులను, చట్టాలను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. కాగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నాయకుడు గురుపత్‌వంత్‌ సింగ్‌ పన్నూ ఆడియో మెసేజ్‌లు లభించినట్టు సమాచారం…

భారత్‌ను ముక్కలు చేయాలన్నది అతని కోరిక అని వాటి ద్వారా తెలుస్తోంది. కశ్మీర్‌ ప్రత్యేక దేశం, ముస్లిం దేశం ఏర్పాటు చేస్తామని వాటిలో పేర్కొన్నాడు…

లఖ్బీర్‌ కోసం 48 చోట్ల దాడులు..

ఖలీస్థానీ ఉగ్రవాది లఖ్బీర్‌ సింగ్‌ లందా, అతని అనుచరుల కోసం పంజాబ్‌ పోలీసులు సోమవారం భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఫిరోజ్‌పూర్‌, దాని సమీప ప్రాంతాల్లో 48 చోట్ల దాడులు చేశారు. ఫిరోజ్‌పూర్‌లోని జీరా ప్రాంతంలో లఖ్బీర్‌ దోపిడీకి పాల్పడి.. కాల్పులు జరిపినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గాలింపు చేపట్టారు.

భారత్‌లో జాగ్రత్త..పౌరులకు కెనడా హెచ్చరిక…

ఇరు దేశాల మఽధ్య ఉద్రికత్తల రీత్యా కెనడా తమ పౌరులకు ట్రావెల్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. భారత్‌లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. కెనడా పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం, సోషల్‌ మీడియాలోనూ నిరసనలకు పిలుపులు వస్తున్న సంగతిని ప్రస్తావించింది…