కెనడా వెళ్లే విద్యార్థులు పునరాలోచన..!! భద్రతపై ఆందోళనలు..!..

..

కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం ప్రకారం ఆ దేశంలో 2.2 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఇది 41 శాతం. అయితే ఖలిస్థాన్‌ తీవ్రవాదంపై కెనడా, భారత్‌ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విద్యార్థులు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు.

ఇప్పటికే కెనడాలో కాలేజీలకు ఐప్లె చేసుకొన్న విద్యార్థులు పునరాలోచనలో పడగా, భవిష్యత్తులో కెనడాకు వెళ్లాలనుకొంటున్న విద్యార్థులు ‘ప్లాన్‌ బీ’గా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్‌ దేశాల వైపు చూస్తున్నారు. విదేశీ విద్య కన్సల్టెంట్లు కూడా ఇదే విధమైన సూచనలు చేస్తున్నాయి. ఆయా దేశాల్లో కూడా టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయని, విద్యార్థులు తమ ఉన్నత విద్య లక్ష్యాలను చేరుకోవడంలో సహకరిస్తాయని రీచ్‌ఐవీ సీఈవో విభ కగ్జి పేర్కొన్నారు.

భద్రతపై ఆందోళనలు..

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఇటీవల భారత్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇదే సమయంలో కెనడా నుంచి భారతీయులు వెళ్లిపోవాలంటూ ఖలిస్థానీ నేత గురుపత్వంత్‌ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆందోళనలు మరింత పెరిగాయి. కెనడాలో భద్రతపై ఆందోళన చెందుతున్నామని హంబర్‌ కాలేజీకి దరఖాస్తు చేసుకొన్న శైష్ఠ మచ్చన్‌ పేర్కొన్నారు. విదేశంలో కుమార్తెను ఒంటరిగా విడిచిపెట్టడంపై మచ్చన్‌ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఖలిస్థానీ మద్దతుదారుల నిరసనలు

నిజ్జర్‌ను భారత ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేశారని ట్రూడో ఆరోపణల నేపథ్యంలో కెనడియన్‌ సిక్కులు ఆ దేశంలోని పలు నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల ముందు తాజాగా ఆందోళనలు నిర్వహించారు. టొరంటో, ఒట్టావా, వాంకోవర్‌లలో నిరసనలు చేపట్టారు. భారత జాతీయ జెండాను తగులబెట్టారు. ఆందోళనకారులు ఖలిస్థాన్‌ అని రాసివున్న పసుపు జెండాలను ప్రదర్శించారు. కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్థానీ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత్‌ నుంచి పంజాబ్‌ను వీడదీయాలనేది వీరి ప్రధాన డిమాండ్‌గా ఉన్నది.
సైనిక సంబంధాలపై ప్రభావం పడదు

కాగా, భారత్‌, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవని కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ పీటర్‌ స్కాట్‌ మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండో-పసిఫిక్‌ ఆర్మీస్‌ చీఫ్‌ల కాన్ఫరెన్స్‌(ఐపీఏసీసీ)లో పాల్గొనేందుకు భారత్‌ పర్యటనలో ఉన్న ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ భారత్‌తో కెనడా రక్షణ సహకారం కొనసాగిస్తుందని చెప్పారు.

ఒత్తిడి పెంచిన అమెరికా

నిజ్జర్‌ హత్యపై కెనడా దర్యాప్తు కొనసాగాలని, నేరస్తులను చట్టం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మథ్యూ మిల్లర్‌ అన్నారు. దర్యాప్తులో సహకరించాలని తాము ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని బహిరంగంగా, అంతర్గతంగా కోరామని పేర్కొన్నారు..