కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…

సిమ్ కార్డుల జారీపై కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ప్రస్తుత రోజుల్లో సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలకు చెక్ పెట్టే లక్ష్యంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్ ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని వల్ల మోసగాళ్లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంలో వారికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి, బల్క్ కనెక్షన్ల రద్దు వంటి పలు అంశాలు ఉన్నాయి.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. సిమ్ కార్డు డీలర్లకు ఇకపై పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. సిమ్ కార్డులు విక్రయించే డీలర్లను ముందుగా పోలీసులు వెరిఫై చేస్తారు. ఆ తర్వాతే వారి నుంచి సిమ్ కార్డుల జారీ ఉంటుంది. మరోవైపు.. ఇకపై బల్క్ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు అందుబాటులో ఉండదు. బల్క్ సిమ్ కార్డుల జారీని కేంద్రం రద్దు చేసింది. ‘ మోసాలను నియంత్రించడానికి ఇకపై సిమ్ డీలర్లకు కచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే సిమ్ డీలర్లు నిబంధనలను అతిక్రమిస్తే.. ఏకంగా రూ. 10 లక్షల వరకు పెనాల్టీ పడుతుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది సిమ్ కార్డు డీలర్లు ఉన్నారు. వీరందరికీ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది.’ అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు..ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ బల్క్ కనెక్షన్స్ కేటాయింపును తొలిగించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సర్వీసుల స్థానంలో కొత్తగా బిజినెస్ కనెక్షన్స్ అనే కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. బిజినెస్‌లకు కేవైసీ సహా, సిమ్ కార్డులు విక్రయించే వారి కేవైసీ కూడా తప్పనిసరిగా ఉంటుందని వివరించారు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. 67 వేల మంది సిమ్ కార్డు డీలర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని తెలిపారు. 2023 మే నెల నుంచి చూస్తే సిమ్ కార్డు డీలర్లపై 300 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయని కేంద్ర మంత్రి వివరించారు. మరోవైపు.. వాట్సాప్ కూడా దాదాపు 66 వేల అకౌంట్లను బ్లాక్ చేసిందని గుర్తు చేశారు. మోసపూర్తిత లావాదేవీలు ఇందుకు కారణమని పేర్కొన్నారు. కేంద్రం కొత్త రూల్స్ వల్ల మోసాలకు అడ్డు కట్ట పడే అవకాశం ఉందన్నారు.