కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్‌లో అదిరిపోయే గిఫ్ట్..డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటన..!!!?.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్‌లో అదిరిపోయే గిఫ్ట్ రానుంది. డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటన మార్చిలో ఉంటే అవకాశం ఉండగా..జనవరి నెల నుంచి వర్తించనుంది. మార్చిలో డీఏ పెంపు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. మరోసారి కేంద్రం 4 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 46 శాతం డీఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్నారు. గతేడాది జనవరి నెల 38 శాతం ఉండగా.. కేంద్రం రెండుసార్లు నాలుగు శాతం చొప్పున పెంచిన విషయం తెలిసిందే. దీంతో 46 శాతానికి చేరుకుంది. మళ్లీ 4 శాతం పెంచితే డీఏ 50 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.

చివరగా గతేడాది అక్టోబర్‌ నెలలో డీఏను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. దీపావళి గిఫ్ట్‌గా 4 శాతం పెంచింది. 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేసింది. డీఏ తరహాలోనే పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేలో డియర్‌నెస్ అలవెన్స్, పెన్షన్ మొత్తంలో డియర్‌నెస్ రిలీఫ్‌ను అందజేస్తుంది. ఏడాదికి రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది. జనవరి 1, జూలై 1 అమలులోకి రానుండగా.. సాధారణంగా డీఏ పెంపు ప్రకటనలు మార్చి, సెప్టెంబర్‌లో వస్తాయి.

పెరుగుతున్న ధరల ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ AICPI ఇండెక్స్ 139.1 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో డియర్‌నెస్ అలవెన్స్‌ మరోసారి 4 శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో డియర్‌నెస్ అలవెన్స్‌ను 50 శాతానికి చేరుతుంది. ఈ ఏడాది మార్చి నెలలో డీఏ పెంపును ప్రకటిస్తే.. దాదాపు 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ, డీఆర్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.12,857 కోట్లు భారం పడుతోంది.

మరోవైపు కొత్త పే కమిషన్ సంఘం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిబంధనల ప్రకారం డీఏ 50 శాతం దాటితే.. ఆ మొత్తాన్ని బేసిక్ పేలో కలిపేసి మళ్లీ జీరో నుంచి డీఏను లెక్కించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త పే కమిషన్ తీసుకువస్తుందా..? లేదా మరో ఏదైనా ఫార్మూలను తీసుకువస్తుందా అనేది తేలాల్సి ఉంది.