మండుటెండలతో జరంత భద్రం… కేంద్రం హెచ్చరిక

*న్యూఢిల్లీ*

రోజురోజుకు ముదురుతున్న ఎండలతో ప్రజలు అతలాకుతలం అవుతున్న వేళ కొంత జాగ్రత్త వహించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది…
ఈ వేసవిలో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
దేశంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు సమాచారం అందుతోంది. అందువల్ల వేడి కారణంగా తలెత్తే అనారోగ్యాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ఎన్‌సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) ఏప్రిల్‌లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తమానం పంపింది. అందువల్ల ఉష్ణోగ్రతల కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలకు సంబంధించిన జాతీయ కార్యాచరణ (నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఆన్‌ హీట్‌ రిలేటెడ్‌ ఇల్‌నెస్‌)లోని అంశాలపై ప్రచారం చేయాలి. ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం (ఐడీఎస్‌పీ) కింద వేడి సంబంధ అనారోగ్యాలపై నిఘా ఉంచండి అని అందులో పేర్కొన్నారు…