తైవాన్‌పై యుద్ధమేఘాలు…అన్ని రకాలుగా చైనా దాడులు..!

ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌లో ఇవాళ జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు..తైవాన్‌లో శనివారం జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తైవాన్‌ను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్న చైనా ఇప్పటికే ఉచ్చు బిగుస్తున్నది. ద్వీపకల్పాన్ని అష్టదిగ్బంధనం చేసిన చైనా ఆ దేశ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో తైవాన్‌లోని బ్యాంకులు మూతపడుతున్నాయి. ప్రజలు కోట్ల రూపాయల లావాదేవీలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. తైవాన్‌లోని ప్రపంచంలోనే అత్యంత అధునాతన సెమికండక్టర్‌ పరిశ్రమ స్తంభించిపోయింది. చైనా ప్రత్యక్షంగా తన సేనలను పంపడం తప్ప మిగిలిన అన్ని విధాలుగా తైవాన్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నది. చైనా ప్రత్యక్షంగా దాడికి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రూ.828 లక్షల కోట్ల నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు..స్వయంప్రతిపత్తి పాలనలో ఉన్న తైవాన్‌ను చైనా తనదిగా భావిస్తున్నది. చైనా తమపై దాడిచేసిన రోజున కేవలం తమ రక్షణ వ్యవస్థకు, భద్రతా దళాలకు మాత్రమే నష్టం జరుగదని, తైవాన్‌ను పూర్తిగా ప్రపంచం నుండి వేరుచేయడానికి ప్రయత్నిస్తుందని ఆ దేశ సైబర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తైవాన్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌పై ప్రతిరోజు లక్షల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయని తైవాన్‌ జాతీయ రక్షణ, భద్రత పరిశోధన సంస్థ నిపుణుడు క్రిస్టల్‌ టు చెప్పారు. ఇప్పటికే కొందరు తమ నెట్‌వర్క్‌ను వారి స్వాధీనంలోకి తీసుకొని ‘ఆ రోజు’ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. చైనా ఆక్రమణను ప్రకటించగానే వారు తమ టెలికమ్యూనికేషన్లను, ఇంధనం, ఆర్థిక రంగాలను స్తంభింపచేయగలరని పేర్కొన్నారు.

సైబర్‌ దుండగులు తైవాన్‌ ప్రభుత్వ, రక్షణ సంస్థలనే కాకుండా అక్కడి సెమికండక్టర్‌ పరిశ్రమను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థకు జీవనాడిగా పేర్కొనే చిప్స్‌ సరఫరాలో తైవాన్‌ కంపెనీలు కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. సెమికండక్టర్‌ పరిశ్రమలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అవసరమైతే ధ్వంసం చేస్తాం తప్ప వాటిని చైనా దళాల చేతిలో పడనివ్వబోమని అమెరికాకు చెందిన ఓ అధికారి గత ఏడాది అన్నారు….

శుక్రవారం నుంచి ఆ దేశం చుట్టూ 8 యుద్ధ నౌకలు, 42 ఫైటర్‌జెట్‌లను మోహరించింది. గడిచిన కొన్నేళ్లుగా చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా.. ఈ సారి తైవాన్‌ సమీపంలోని లుయాన్‌ సముద్రతీరంలో ‘లైవ్‌ఫైర్‌ ట్రైనింగ్‌’ నిర్వహిస్తామని ప్రకటించింది. సోమవారం తైవాన్‌కు 80 కిలోమీటర్ల దూరంలో లైవ్‌ఫైర్‌ శిక్షణ విన్యాసాలకు చైనా సిద్ధమైంది. జాయింట్‌ సోర్డ్‌, లైవ్‌పైర్‌ ట్రైనింగ్‌ నిర్వహించడం ముందెన్నడూ జరగలేదని, ఈ సారి చైనా తీసుకున్న నిర్ణయం ఆందోళనకరమని విశ్లేషకులు చెబుతున్నారు…

అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామి

ఈ శతాబ్దిలో తైవాన్‌ పలు రంగాల్లో అగ్రస్థానాన్ని అందుకుని, ఆయా రంగాల్లో చైనా ఆధిపత్యానికి సవాల్‌ విసురుతోంది. 600 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న తైవాన్‌ సెమీకండక్టర్ల ఉత్పత్తి, హైటెక్‌ పరిశ్రమల్లో అగ్రగామిగా ఉంది. పైగా.. అమెరికాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. అమెరికా కూడా ఆర్థిక శక్తి, వ్యూహాత్మక ప్రదేశం, సైద్ధాంతిక కారణాలు అనే మూడు అంశాలపై బేరీజు వేసుకుని, చిన్న దేశాలకు భద్రతపై హామీ ఇస్తుంది. అన్నింటికీ మించి.. ఒకవేళ తైవాన్‌ గనక చైనా పరమైతే.. తూర్పున 150 నాటికన్‌ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలపై చైనాకు పట్టు పెరుగుతుంది. జపాన్‌తోపాటు.. అమెరికాలోని గువామ్‌ ద్వీపంపై దాడి చేయడం చైనాకు సులభమవుతుంది. ఈ కారణాల వల్ల తైవాన్‌కు అమెరికా మద్దతిస్తోంది. అయితే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరిపినప్పుడు అమెరికా ప్రేక్షక పాత్రనే పోషించిందని, ఆయుధాలను సరఫరా చేయడం మినహా ఉక్రెయిన్‌కు పెద్దగా మద్దతివ్వలేదనే విషయాన్ని అంతర్జాతీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు…

చైనాకు తైవాన్‌ ఎందుకు కీలకమంటే..?

చైనా ముందు నుంచి తైవాన్‌ను తమ దేశం నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గానే పరిగణిస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సైతం పలు సందర్భాల్లో చైనాలో తైవాన్‌ విలీనం జరిగి తీరుతుందని ఉద్ఘాటించారు. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా 100వ వార్షికోత్సవం జరగనున్న 2049 నాటికి ప్రపంచంలోనే చైనాను అతిపెద్ద శక్తిగా నిలిపేందుకు జిన్‌పింగ్‌ ప్రణాళికలు రూపొందించారు. టిబెట్‌, హాంకాంగ్‌ను విలీనం చేసుకున్న చైనాకు.. తైవాన్‌ ఇప్పటికీ కొరకురాని కొయ్యగా మిగిలిపోయింది. ఆ ఒక్కటీ కలిస్తే.. గ్రేటర్‌ చైనాగా దేశాన్ని విస్తరించవచ్చనేది జిన్‌పింగ్‌ వ్యూహంగా తెలుస్తోంది. ఒకవేళ తైవాన్‌పై పట్టు సాధించకుంటే.. టిబెట్‌, షిన్జియాంగ్‌ ప్రాంతాల్లో వేర్పాటు ఉద్యమాలు పెరిగే ప్రమాదముందని చైనా ఆందోళన చెందుతోంది..