చంద్రబాబు పర్యటనలో పోలీసుల ఆంక్షలు.. అనపర్తిలో ఉద్రిక్తత..

అనపర్తి.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మూడోరోజు పోలీసులు ఆంక్షలు విధించారు..

అనపర్తి దేవీచౌక్‌ సెంటర్‌లో చంద్రబాబు పర్యటనకు నిన్న అనుమతిచ్చిన పోలీసులు, ఇవాళ అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పటికిప్పుడు ప్రైవేటు స్థలం తీసుకుని కార్యక్రమం పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెదేపా(TDP) శ్రేణులు ముందుగా నిర్ణయించుకున్న దేవీచౌక్‌ సెంటర్‌లోనే రోడ్‌ షో ఉంటుందని తెలిపాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే ఊరుకునేది లేదని నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు..

జిల్లాలో చంద్రబాబు రెండ్రోజుల సభలకు ప్రజా స్పందన చూసి ఓర్వలేకే ఇవాళ అనుమతి లేదంటున్నారని మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా తెదేపా శ్రేణులు దేవీచౌక్‌ సెంటర్‌కు భారీగా చేరుకున్నారు. కార్యకర్తలు రాకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ దౌవీచౌక్‌ సెంటర్‌కు పార్టీ శ్రేణులు దూసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు తెదేపా కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు కూడా భారీగా మోహరించడంతో అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా తెదేపా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు..