జపాన్‌, ఇజ్రాయెల్‌కే సాధ్యం కాలేదు…ఊపిరి బిగపట్టి భారత్‌ చంద్రయాన్‌-3..!

Chandrayaan 3..
చందమామ ఇచ్చే గిఫ్ట్‌ ఇదే..!..

భారత్‌ మొత్తం ఊపిరి బిగపట్టి చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ల్యాండింగ్‌ కోసం నిమిషాలు లెక్కపెడుతోంది. ఈ మిషన్‌లో చివరి 17 నిమిషాల్లో భారత్‌ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది..

మన విక్రమ్‌ ల్యాండర్‌ ఈ దశను దాటి సురక్షితంగా జాబిల్లిని ముద్దాడితే.. సరికొత్త చరిత్రను రచించినట్లవుతుంది. ఒక రకంగా చూస్తే రష్యాకు కూడా దక్కని ఖ్యాతి భారత్‌కు లభిస్తుంది. ఎందుకంటే రష్యా పేరిట ఉన్న విజయాలు మొత్తం సోవియట్‌ కాలంలో వచ్చినవే. రష్యాగా ఏర్పడిన తర్వాత రాస్‌కాస్మోస్‌ చేసిన ఏకైక ప్రయోగం విఫలమైంది.

అసలు చంద్రుడి వద్దకు వెళ్లే ప్రాజెక్టులు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటి వరకు 12 దేశాలు 141 సార్లు యత్నిస్తే.. కేవలం 69 సార్లు మాత్రమే విజయం సాధించాయి. టెక్‌ దిగ్గజ దేశమైన అమెరికానే 15 వైఫల్యాలను మూటగట్టుకొందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇక ఇస్రో (ISRO) చేపట్టిన మూడింటిలో.. ఒక విజయం, మరో వైఫల్యం అందుకొంది. మూడోది మార్గం మధ్యలో ఉంది.

*భారత్‌ సాంకేతికత శక్తి మాట్లాడుతుంది*..!

చంద్రయాన్‌-3 (Chandrayaan-3) సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ఒక రకంగా భారత్‌ సాంకేతికత పురోగతిని తెలియజేస్తుంది. ఇప్పటికే అంతరిక్ష రంగంలో ఆస్ట్రేలియా, జపాన్‌, ఇజ్రాయెల్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు కూడా సాధ్యంకాని ఘనతను సాధించినట్లవుతుంది. ఎందుకంటే అత్యంత సూదూరంలోని అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్లు ఏర్పాటు చేసుకోవడం, దానిలో సిస్టమ్స్‌ అన్నీ సక్రమంగా పనిచేసేట్లు చూడటం పెనుసవాలు. భారత్‌ చంద్రయాన్‌-1 లక్ష్యం పూర్తిగా విజయంతమైంది. ఇది హార్డ్‌ ల్యాండింగ్ మిషన్‌. అప్పుడు జాబిల్లిపై నీటిజాడను గుర్తించారు కూడా. ఈ మిషన్‌ విజయవంతమవడంతో భారత్‌కు నేషనల్‌ స్పేస్‌ సొసైటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ నుంచి అవార్డులు కూడా లభించాయి.

*జపాన్‌, ఇజ్రాయెల్‌కే సాధ్యం కాలేదు*..

సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అంటే ముందుగానే నిర్ణయించిన స్థలంలో ప్లాన్‌ ప్రకారం దిగడం.. భారత్‌ ఇది సాధిస్తే ఇతర దేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. 2019లో చంద్రయాన్‌-2 ద్వారా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం యత్నించాం. కానీ, 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఐదు ఇంజిన్లు సమన్వయం చేసుకోవడంలో సమస్యలు రావడంతో హార్డ్‌ ల్యాండ్‌ అయింది. ఆ తర్వాత చంద్రయాన్‌-2 కూలిన విషయాన్ని నాసా ధ్రువీకరించింది. అదే ఏడాది భారత్‌ కంటే సాంకేతికతలో ఎంతో ముందున్న ఇజ్రాయెల్‌ బెర్షిత్‌ ల్యాండర్‌ను చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయించేందుకు యత్నించింది. కానీ, ఇది కూడా బ్రేకింగ్‌ దశలో విఫలమై కూలిపోయింది. ఇక ఏప్రిల్‌ 2023లో జపాన్‌కు చెందిన ప్రైవేటు స్పేస్‌ సంస్థ ‘ఐస్పేస్‌’ సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు యత్నించింది. ఇందు కోసం ‘హక్తో-ఆర్‌’ ల్యాండర్‌ను పంపింది. దీంతోపాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ‘రషీద్‌’ అనే రోవర్‌ను తీసుకెళ్లింది. కానీ, ఈ మిషన్‌లో చివరి నిమిషంలో చేసిన మార్పుల కారణంగా జాబిల్లికి ఐదు కిలోమీటర్ల ఎత్తులోనే దీనిలో ఇంధనం ఖాళీ అయ్యింది. తాజాగా సోవియట్‌ నుంచి వారసత్వంగా అందిన అంతరిక్ష టెక్నాలజీతో రష్యా లూనా-25ను ప్రయోగించింది. ఇది కూడా చివరిదశలో అదుపు తప్పి కూలిపోయింది. వాస్తవానికి చంద్రయాన్‌-3(Chandrayaan-3) సురక్షితంగా నియంత్రిత విధానంలో ఉపరితలంపై దిగితే.. సోవియట్‌, అమెరికా, చైనా తర్వాత ఈ టెక్నాలజీని నిరూపించుకొన్న నాలుగో దేశమవుతుంది.

*అంతరిక్ష రంగంలో సొమ్ము చూస్తే కళ్లు తిరగాల్సిందే*..!

భారత్‌కు చెందిన ఇస్రో ఇతర గ్రహం మీదకు చేసిన యాత్రలు మొత్తం హాలీవుడ్‌ సినిమా ‘ఇంటర్‌స్టెల్లర్‌’ కంటే తక్కువ బడ్జెట్‌తో చేపట్టినవే. ఇంటర్‌స్టెల్లర్‌కు సుమారు 13 వందల కోట్ల రూపాయలు ఖర్చు కాగా.. చంద్రయాన్‌-2కు రూ.978 కోట్లు, మంగళ్‌యాన్‌కు రూ.450 కోట్లు, ఇక చంద్రయాన్‌-3 (Chandrayaan-3)కు రూ.615 కోట్లు ఖర్చయ్యాయి. ఇంత చౌకగా ఏ దేశమూ ఇతర గ్రహ యాత్రలు చేపట్టలేదు. అంతరిక్ష రంగంలో డబ్బు వదిలించుకోవడమే గానీ.. పెట్టుబడులొస్తాయా.. అనే వారికి డెలాయిట్‌ రిపోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 2013 నుంచి 1,791 అంతరిక్ష టెక్నాలజీ కంపెనీల్లో రూ.22 లక్షల కోట్ల (272 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి. ఇక స్పేస్‌ ఫౌండేషన్‌ లెక్కల ప్రకారం 2023 ద్వితీయార్ధం నాటికి స్పేస్‌ ఎకానమీ విలువ రూ.45 లక్షల కోట్లు (546 బిలియన్‌ డాలర్లు)గా పేర్కొంది. గత పదేళ్లలో ఈ రంగం విలువలో 91 శాతం వృద్ధి నమోదైంది. అతి తక్కువ ఖర్చుతో భారత్‌ చేపట్టే ప్రయోగాలు ఇందులో 10 శాతం వాటా దక్కించుకొన్నా.. దేశ అంతరిక్ష రంగం దశదిశా మారిపోతోంది.

*లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు.. 60 సెకన్లలో చంద్రయాన్‌-3 ప్రయాణం*

మన దేశం 1999 నుంచి ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన దాదాపు 381 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. దీని ద్వారా 279 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. భారత అంతరిక్ష రంగ విలువ 2025 నాటికి 13 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం 2023-24 బడ్జెట్‌లో భారత ప్రభుత్వం అంతరిక్ష రంగానికి రూ. 12,543 కోట్లు కేటాయించింది. భారత్‌లో ఈ రంగం విలువ 8 బిలియన్‌ డాలర్లు.. ఇది ప్రపంచ స్పేస్‌ ఎకానమీలో 2శాతం మాత్రమే. కానీ, అంతర్జాతీయ కన్సల్టెన్సీ ఆర్థర్‌ డి లిటిల్‌ ప్రకారం భారత్‌లో ఈ రంగం 2040 నాటికి 100 బిలియన్‌ డాలర్లను చేరుకొంటుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో స్కైరూట్‌, శాట్‌ష్యూర్‌, ధ్రువ్‌ స్పేస్‌, బెల్లాట్రిక్స్‌ వంటి 140 స్టార్టప్‌లు రిజిస్టరై పనిచేస్తున్నాయి. ఇవి శాటిలైట్‌ ఆధారిత ఫోన్‌ సిగ్నల్స్‌, బ్రాడ్‌బ్యాండ్‌, ఓటీటీ, 5జీ, సోలార్‌ ప్యానల్స్‌ వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. అంతరిక్ష రంగంలో భారత్‌ తయారు చేసే హర్డ్‌వేర్‌కు కూడా గిరాకీ పెరుగుతుంది. ఫలితంగా వాటి తయారీ పరిశ్రమల్లోకి పెట్టుబడులు పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.