ఈ నెల 23న విక్రమ్‌ ల్యాండర్‌..

ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram lander) చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్‌ ల్యాండర్‌ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో భూమికి ఎప్పుడూ కనిపించని చంద్రుడి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ల్యాండర్‌ తన కెమెరాలో బంధించింది…భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పోస్టు చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవైడెన్స్‌ కెమెరా (Lander Hazard Detection and Avoidance Camera) చంద్రుడి అవతలివైపు ఫొటోలను తీసినట్లు తెలిపింది. జాబిల్లిపై విక్రమ్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేందుకు ఈ కెమెరా సాయపడుతుందని పేర్కొంది. బండరాళ్లు, లోతైన కందకాలు లేని సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు విక్రమ్‌ ల్యాండర్‌ అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది..తొలుత ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే తాజాగా ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రో (Indian Space Research Organisation) ట్విట్టర్‌ ద్వారా నిన్న వెల్లడించింది. మరోవైపు చంద్రయాన్‌-3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్‌-3పైనే ఉన్నాయి. చారిత్రక ఘట్టం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు…