రేపే ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో పోలింగ్.. సందడి షురూ..

*Chhattisgarh Polling:

*ఐదు రాష్ట్రాల ఎన్నికల సందడి మొదలవుతోంది. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. అప్పుడే ఛత్తీస్‌గఢ్, మిజోరం పోలింగ్‌కి టైమ్ వచ్చేసింది. రేపు (మంగళవారం) ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ జరగబోతోంది.*

ఐతే… ఛత్తీస్‌గఢ్‌లో ఇది తొలి దశ మాత్రమే. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రచారానికి నిన్నటితో బ్రేక్ పడింది. ఇప్పుడు భారీగా తాయిలాలు ఇచ్చే పనిలో పడ్డారు అభ్యర్థులు.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా.. తొలి దశలో 20 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మిజోరం అసెంబ్లీలో 40 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. కానీ తొలిదశలో ఓటు వెయ్యనివ్వకుండా భయపెట్టేందుకు మావోయిస్టులు కొంత హింసకు పాల్పడ్డారు. ఇది ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు ఉన్నాయి.

ఐదు రాష్ట్రాలకూ కౌంటింగ్.. డిసెంబర్ 3న ఉంటుందని మనకు తెలుసు. ఐతే.. మిజోరం అసెంబ్లీ కాల వ్యవధి డిసెంబర్ 17న ముగుస్తుంది. అలాగే.. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి కాల వ్యవధి జనవరి 3న ముగుస్తుంది.

*సమస్యల్లో కాంగ్రెస్:*

ఈసారి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి ఎదురుగాలి వీస్తోంది. సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel).. మహదేవ్ బెట్టింగ్ ప్రమోటర్ల నుంచి ముడుపుల రూపంలో రూ.503 కోట్లు తీసుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చెప్పడంతో.. దీన్ని బీజేపీ బాగా వాడుకుంది. ఐతే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాలు గెలుచుకుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాలే గెలిచింది.

*మిజోరంలో:*

ఇక మిజోరం సంగతి చూస్తే, 2018లో కాంగ్రెస్, మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) కలిసి 40 స్థానాలకు పోటీ చేశాయి. బీజేపీ 39 స్థానాల్లో బరిలో దిగింది. ఫలితాల్లో.. MNF 28 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు, బీజేపీ 1 స్థానం గెలిచాయి. దాంతో MNF ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇప్పుడు కూడా ప్రజలు ఇలాంటి తీర్పే ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది.