తగ్గిన చికెన్ ధర…చికెన్‌ కిలో 160..!..

పలు రాష్ట్రాల్లో పెరిగిన ఉత్పత్తి..వినియోగం తగ్గి ధర పతనం, రాయితీ బాటలో పలు ప్రభుత్వాలు, మన దగ్గర ఆ ఊసే లేని వైనంతీవ్ర నష్టాల్లో పౌల్ట్రీ వ్యాపారులు..

కోడిగుడ్డుకు గడ్డుకాలం మొదలైంది. గుడ్డు ధర అమాంతం పతనమైంది. కొన్ని రోజులుగా ధర పెరిగినప్పటికీ మళ్లీ తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో గుడ్ల ఉత్పత్తి పెరగడంతో ధర తగ్గిందని పౌల్ర్టీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 10న చిత్తూరులో 100 గుడ్ల ఫాంగేట్‌ ధర రూ.553, విశాఖపట్నంలో రూ.523, విజయవాడలో రూ.485 ఉంది. డజను రూ.78 వరకు పలికాయి. కానీ, క్రమంగా ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం విజయవాడలో 100 గుడ్లు రూ.365, విశాఖపట్నంలో రూ.435, చిత్తూరులో రూ.418 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే డజను గుడ్ల ధర రూ.60కి పడిపోయింది. కేవలం వారం రోజుల్లో గుడ్డుకు రూపాయి నుంచి రూపాయిన్నర దాకా ధర తగ్గింది. ఈ ధర తమకు ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదని పౌల్ర్టీ రైతులు వాపోతున్నారు. మరోవైపు బెంగాల్‌, యూపీ, బిహార్‌, ఒడిసా పౌల్ర్టీల్లో గుడ్ల ఉత్పత్తి పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో పౌల్ర్టీకి ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తుండటంతో కొత్త బ్యాచ్‌లను తీసుకువచ్చి మరీ ఉత్పత్తి పెంచారు. దీనికి తోడు తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బెంగాల్‌, యూపీ, బిహార్‌, పంజాబ్‌, అసోంలో అమ్మవార్ల జాతరలు జరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 4.20 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, 2 కోట్ల గుడ్లు ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. మిగతావి స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి పెరగడంతో మన రాష్ట్రం నుంచి ఎగుమతులు తగ్గుముఖం పట్టినట్టు వ్యాపారులు చెబుతున్నారు. గల్ఫ్‌, ఆఫ్రికన్‌ దేశాలకు తమిళనాడులోని నమ్మక్కల్‌ నుంచి కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. ఏపీ నుంచి కోడిగుడ్లు ఇతర దేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నంకానీ, పౌల్ర్టీలకు రాయితీలిచ్చే విషయంలో కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పెరిగిన దాణా ధరలు, నిలకడ లేని ధరలతో పౌలీ్ట్ర రైతులు నష్టాలపాలవుతున్నారు. మరోవైపు, ఈ నెల 29 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుండటంతో గుడ్డు వినియోగం మరింత తగ్గే అవకాశం ఉండటంతో ధర మరింత పతనమవుతుందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి.

*చికెన్‌ కిలో 160!*

రాష్ట్రంలో చికెన్‌ ధర కూడా తగ్గుముఖం పట్టింది. కిలోకి ఏకంగా రూ.100 తగ్గిపోయింది. గత నెలలో కిలో రూ. 280దాకా పలికిన చికెన్‌, గత పక్షంలో రూ.240కి చేరింది. ప్రస్తుతం రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో రూ.10 నుంచి రూ.20 వరకు తేడా ఉంది. బాయిలర్‌ కోడి ఫాంగేట్‌ ధర గత నెలలో రూ.130, గత పక్షంలో రూ.115 దాకా ఉండగా, ప్రస్తుతం రూ.90కి పడిపోయింది. ఈ పరిణామాలతో పౌలీ్ట్ర వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.