సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎంవీ కృష్ణారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా.. ఆంగ్ల, తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. డెక్కన్ క్రానికల్‌లో న్యూస్ బ్యూరో చీఫ్‌గా ఆయన పనిచేశారు. అక్కడ ఆయన 18 ఏళ్లకు పైగా పనిచేశారు.
పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని సిఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ..వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని కేసీఆర్ తెలిపారు.