సుమారు రెండున్నర కిలోమీటర్లు శవాన్ని మోసి.. మానవత్వం చాటిన సీఐ….!

మోరంచవాగు ఉప్పొంగి ప్రవహించడంతో గల్లంతై చనిపోయిన గొర్రె ఓదిరెడ్డి అనే వ్యక్తి మృతదేహాన్ని శనివారం పోలీసులు డ్రోన్‌ ద్వారా గుర్తించారు. వెంటనే భూపాలపల్లి సీఐ రాంనర్సింహారెడ్డి వాగులో నీరు నిండుగా ప్రవహిస్తున్నా దాటుకుంటూ వెళ్లి మృతదేహం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో ఓ కర్రకు కట్టించి.. స్వయంగా ఆయన మోస్తూ.. మరికొందరి సాయంతో సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు.

అక్కడి నుంచి ట్రాక్టర్‌లో మోరంచపల్లిలో బంధువులకు అప్పగించారు. చిట్యాల ఎస్సై రమేశ్‌ సహకారం అందించారు. వీరిని జిల్లా ఎస్పీ కరుణాకర్‌, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అభినందించారు.