కేంద్రం నిర్ణయాలతో మధ్యతరగతి కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి.. : సీఎం కేసీఆర్.

R9TELUGUNEWS.Com: దేశంలో ధాన్యాన్ని సేకరిచండం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం, దేశ ఆహార భద్రత కోసం బఫర్‌ స్టాక్‌ నిల్వ చేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎం కేసీఆర్ అన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కేంద్రంలో అధికారం చేపట్టిన భాజపా ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో పేదల వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. వారి నిర్ణయాలు సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం మోపే విధంగా ఉంటున్నాయన్నారు. కేవలం ఒక రంగం అనే కాకుండా అనేక రంగాల్లో ఇలాంటి విధానాలనే కేంద్రం అవలంబిస్తోందని కేసీఆర్ ధ్వజమెత్తారు.

ఇంత గోరమైన కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేదు..

కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సామాజిక బాధ్యతను విస్మరించి ధాన్యాన్ని కొనలేమని చెబుతోంది. ధాన్యం సేకరణ విషయంలో పెద్ద రాద్ధాంతం సృష్టించి దేశంలోని రైతులందరికీ గందరగోళానికి గురి చేస్తోంది. రూ.లక్షల కోట్ల బడ్జెట్ కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వం కిరాణా దుకాణదారుడిలా మాట్లాడవద్దు. అది సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వానికి అది ఔన్నత్యం కాదు. ప్రతి విషయంలోనూ లాభనష్టాలను బేరీజు వేసుకొని మాట్లాడటం సరైంది కాదు. అలా చేస్తే ప్రభుత్వం ఎలా అవుతుంది? ఏ ప్రభుత్వమైనా ప్రజా పంపిణీపై సామాజిక బాధ్యత ఉండాలి. నిర్వహణలో భాగంగా ఎప్పుడైనా కేంద్రం వద్ద నిల్వలు పెరిగితే అందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించే శక్తి కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఒక సందర్భంలో నష్టం వస్తే కేంద్రం భరించాలే తప్ప రాష్ట్రాలపై నెట్టకూడదు. ఇలాంటి నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదు. ఇకపై చూస్తానని కూడా అనుకోవడం లేదు. పచ్చి అబద్ధాలు ఆడుతూ కేంద్రం దిగజారి ప్రవర్తిస్తుంది’’

ఒక కోటా ఇస్తే అంతవరకే పండిస్తాం..
కేబినెట్‌ భేటీలో ధాన్యం సేకరణపై సుదీర్ఘంగా చర్చించాం. గత యాసంగి ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా తీసుకోలేదు. గత యాసంగిలో రాష్ట్రం సేకరించిన ధాన్యానికి కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని మాతో లేఖ రాయించుకున్నారు. మెడ మీద కత్తి పెట్టి లేఖ రాయించుకున్నారు. వానాకాలంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవాలని కోరాం. రాష్ట్ర వాతావరణం దృష్ట్యా యాసంగి పంట బాయిల్డ్‌ రైసుకే అనుకూలంగా ఉంటుంది. బాయిల్డ్‌ రైస్‌ను గతంలో ఎఫ్‌సీఐ ప్రోత్సహించింది. ‘ఏడాదికి ఒకసారి ఇంత తీసుకుంటాం’ అని ఒక కోటా ఇస్తే అంతవరకే పండించి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం. ‘అది మేం చెప్పం’ అంటున్నారు. మరి రైతులు ఏం చేయాలి? కేంద్రం సహకరించనప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. ఏపీ ఇబ్బందులు పెట్టినా, కొందరు కేసులు వేసినా ప్రాజెక్టులు నిర్మించాం. మా కృషి వల్ల తెలంగాణలో పంటలు దిగుబడి పెరిగింది. గతంలో తెలంగాణలో 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగింది. తెరాస హయాంలో 69.3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాం’’

కిషన్‌రెడ్డి ఉండి కూడా రాష్ట్రానికి ప్రయోజనం లేదు..

‘‘ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అన్నింటికీ ఎదురొడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లాం. రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం. 24 గంటల నిరంతర విద్యుత్‌ అందిస్తున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలని అన్ని రంగాల్లో అనేక చర్యలు తీసుకున్నాం. వాటర్‌ సెస్‌ లేకుండా నీళ్లిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇదంతా చూసి భాజపా జీర్ణించుకోలేకపోతుంది. నిర్వహణ సామర్థ్యం లేని భాజపా మాపై నిందలు వేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉండి కూడా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో ధాన్యాన్ని కొనిపించాలి. తెలంగాణ వాతావరణం బాయిల్డ్‌ రైసుకే అనుకూలం అని కేంద్రం వద్ద వాదన వినిపించాలి’’ అని సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు.

*_బంగ్లాదేశ్‌, నేపాల్‌ కన్నా హీనస్థితిలో ఉన్నాం.._*

750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ భాజపా. రైతులను కార్లు, ట్రాక్టర్లతో తొక్కించింది భాజపా నేతలు, కేంద్ర మంత్రులు కాదా? మీది రైతు రాబంధు పార్టీ. ఏడాదికిపైగా కరోనా, చలి, ఎండను లెక్కచేయకుండా రైతులు పోరాడితే వారు ఆందోళనకారులని ముద్ర వేశారు. చివరికి మీరే దిగొచ్చి క్షమాపణ చెప్పారు. చమురు ధరలు తగ్గిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన ఘనత ఈ భాజపా ప్రభుత్వానికే దక్కుతుంది. ఇదంతా పక్కన పెట్టి రాష్ట్రం వ్యాట్‌ తగ్గించాలని మళ్లీ వాళ్లే ధర్నాలు చేస్తారు. రాష్ట్ర మంత్రులను అవమానించేలా కేంద్ర మంత్రి మాట్లాడారు. ‘మీకేం పనిలేదా.. మళ్లీ వచ్చారు’ అని కేంద్ర మంత్రి అన్నారు. ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం.. 116 దేశాల్లో సర్వే చేస్తే భారత్‌ 101వ స్థానంలో ఉంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాలతో పోల్చితే హీన స్థితిలో ఉన్నాం. కేంద్రం వద్ద నిల్వలు ఎక్కువ అయ్యాయి అని చెబుతున్నారు. ఎక్కువైతే ఎందుకు భారత్‌ ఆకలి సూచిలో వెనుకబడి ఉంది? కేంద్రానికి సామాజిక బాధ్యత ఉంటే ధాన్యాన్ని సేకరించి ఆకలితో ఉన్న బిడ్డలకు పంచిపెట్టండి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం నిద్ర తేరుకోవాలి.

*_ఈ ఏడేళ్లలో భాజపా చేసిన సంక్షేమం ఏమిటో చెప్పాలి_*

రైతులు, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకు విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతుల మెడ మీద కత్తిపెట్టి ప్రతి బోరుకు మీటర్‌ పెట్టాలని చూస్తోంది. విద్యుత్‌ సంస్కరణలపై మాట్లాడాలని కేంద్ర మంత్రి నుంచి లేఖ వచ్చింది. మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే అప్పులు ఆపేస్తారంట. కేవలం 16 గంటలే విద్యుత్‌ వాడుకోవాలని చెప్పడం సంస్కరణలు అవుతాయా?సాగు రంగాన్ని తీసుకెళ్లి అంబానీ, అదానీ చేతిలో పెట్టాలని చూశారు. వాస్తవం గ్రహించిన ఉత్తరాది రైతులు ఉద్యమం చేశారు. రైతుల పోరాటం, యూపీ ఎన్నికలు చూసి సాగు చట్టాలు రద్దు చేశారు. రాష్ట్రాల హక్కులను హరించి కేంద్రం తీసుకుంటుందట. ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను ఇస్తుంటే దాన్ని నాశనం చేయాలని కేంద్రం చూస్తోంది. రూ.80 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారు?రెండేళ్లుగా దేశంలో పేదరికం విపరీతంగా పెరిగింది. ఈ ఏడేళ్లలో భాజపా చేసిన సంక్షేమం ఏమిటో చెప్పాలి. రైతులు బాగుపడాలంటే భాజపాను పారదోలాలి.

*_యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలుండవు.._*

కేంద్రం కొంటామంటే వరి పండించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ బాయిల్డ్‌ రైస్‌ కొనేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పంది. ఎంత పోరాడినా కేంద్రం ఒప్పుకోవడం లేదు. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకే కేంద్రం ఒప్పుకుంది. యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. సొంతంగా విక్రయించుకునే రైతులు యాసంగిలో వరి వేసుకోవచ్చు. ధాన్యం పండించి రైతులు నష్టపోవద్దని మేం ధైర్యంగా చెబుతున్నాం. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అందిస్తాం’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.