ఈనెల 18న మేడారానికి సీఎం కేసీఆర్…

R9TELUGUNEWS.COM: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 18న మేడారం జాతరకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ మీడియాకు తెలియజేశారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు తెలిపారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలకు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరకు విజయవంతం చేయాలన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడా ఏ సమస్య రాకుండా చూసేందుకు జాతరలో మొత్తం 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని మంత్రులు చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర చాలా కీలకమని అన్నారు. గతంలో 3,300 బస్సులను జాతరకు నడపగా.. ఈసారి మరో 500 పెంచామని, మొత్తం 3800 బస్సులు నడపనున్నామని చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణించే భక్తులు మాత్రమే సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలకు సమీపంలో దిగుతారని చెప్పారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.