ఓటు వ‌జ్రాయుధం.. ఆ ఓటు నీత‌ల‌రాత‌ను మారుస్త‌ది.. నీ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యం చేస్త‌ది.. సీఎం కేసీఆర్..

ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంట‌కుండా మింగుదామ‌నా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ప్ర‌జాస్వామ్యంలో ఓటు వ‌జ్రాయుధం.. ఆ ఓటు నీత‌ల‌రాత‌ను మారుస్త‌ది.. నీ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యం చేస్త‌ది అని కేసీఆర్ తెలిపారు. అందుకే ఆషామాషీగా ఓటు వేయొద్దు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు ప‌రిపాలించింది. మ‌ళ్లా ఇవాళ వ‌చ్చి ఒక్క‌సారి మాకు ఛాన్స్ ఇవ్వండ‌ని అంటున్న‌రు. ఎందుకు పంటికి అంట‌కుండా మింగుదామ‌నా..? దేనికి మీకు..? ఒక్క సారి కాదు.. 11, 12 సార్లు ఛాన్స్ ఇచ్చారు. మీకు ఇవ్వ‌లేద‌ని కాదు. ఈశ్వ‌ర్ ఎమ్మెల్యే అయ్యాక ధ‌ర్మ‌పురి ఎలా ఉంది.. అంత‌కుముందు ఎట్ల ఉండేనో తేడా గ‌మ‌నించాలి. టెయిల్ ఎండ్ కాలువ‌లు ఉన్నాయి.. ఆ రోళ్ల‌వాగు ప్రాజెక్టు అని స‌తాయించిండు. నా వెంట‌ప‌డి ఆ ప‌నులు చేయించాడు. ఇవాళ దాదాపు 1 ల‌క్ష 30 వేల ఎక‌రాలు సాగు అవుతుంది. ఈ తేడాను మీరు గ‌మ‌నించాలి అని కేసీఆర్ సూచించారు.

క‌రెంట్, తాగు, సాగు నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నాం..
గ‌తంలో ఎమ్మెల్యేలు అయ్యారు కానీ వారు ధ‌ర్మ‌పురి అభివృద్ధి చేయ‌లేదని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈశ్వ‌ర్ పీరియ‌డ్‌లో అభివృద్ధి జ‌రిగింది. వాగుల‌పై చెక్ డ్యాంలు క‌ట్టించారు. మిష‌న్ కాక‌తీయ కింద చెరువుల‌ను బాగు చేసుకున్నాం. తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో చిమ్మ‌చీక‌ట్లు, మంచి, సాగునీళ్లు లేవు. వ‌ల‌స బ‌తుకులు, ఎక్క‌డ చూసినా అంధ‌కార‌మే. మూడు నాలుగు నెల‌లు మెద‌డును రంగ‌రించి, అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశాం. ఇప్పుడు క‌రెంట్, తాగు నీటికి ఇబ్బంది లేదు. సాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నాం. ప్ర‌ధాని రాష్ట్రంలో కూడా 24 గంట‌ల క‌రెంట్ ఇస్త‌లేరు అని కేసీఆర్ తెలిపారు.

చ‌చ్చినా స‌రే మీట‌ర్లు పెట్ట‌నని చెప్పాను..
ప్ర‌ధాని మోదీకి ఓ పిచ్చి ప‌ట్టుకుంది. అదే ప్ర‌యివేటైజేష‌న్.. రైళ్లు, ఓడ‌రేవులు, విమానాలు ప్ర‌యివేటైజేష‌న్.. ఆఖ‌రుకు క‌రెంట్ కూడా ప్ర‌యివేటు. రైతుల మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టి బిల్లులు వ‌సూళ్లు చేయాల‌ని చెప్పిండు. చ‌చ్చినా స‌రే పెట్ట‌ను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాను. మ‌న‌కు రావాల్సిన ఏడాదికి 5 వేల కోట్లు క‌ట్ చేశారు. 25 వేల కోట్లు న‌ష్ట‌పోతూ కూడా మీట‌ర్లు పెట్ట‌లేదు. భ‌విష్య‌త్‌లో కూడా మీట‌ర్లు పెట్టం. ఈ తేడాను గ‌మ‌నించాలి అని కేసీఆర్ సూచించారు.

రాబందులే త‌ప్ప రైతుబంధులు లేరు..
అంత‌కుముందు రైతుబంధు లేదు.. రాబందులే త‌ప్ప రైతుబంధులు లేరు అని కేసీఆర్ తెలిపారు. రైతు బంధు అమ‌లుతో రైతుల ముఖాలు తెల్ల‌ప‌డుతున్నాయి. అప్పులు క‌ట్టుకుంటున్నారు. సొంత పెట్టుబ‌డి పెట్టుకుంటున్న‌రు. వ‌డ్డీల బాధ త‌ప్పింది. ఆ ర‌కంగా వ్వ‌య‌సాయం నిల‌బ‌డింది. పండించిన ధాన్యాన్ని కొంటున్నాం. పైస‌లు కూడా వెంట‌నే జ‌మ చేస్తున్నాం. వెంట‌నే మీరు బ్యాంక్‌కు వెళ్లి తీసుకుంటున్నారు. ధ‌ర‌ణిని తీసేస్తామ‌ని రాహుల్ గాంధీ అంటున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ‌చ్చిన త‌ర్వాత భూములు సేఫ్‌గా ఉన్నాయి. మండ‌ల కేంద్రాల్లోనే రిజిస్ట్రేష‌న్లు అయిపోతున్నాయి. ద‌ళారీ లేడు, రూపాయి లంచం లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.