సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ భేటి…

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష్యుడు, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఆయన అధ్యక్ష్యతన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ భేటి ప్రారంభం అయింది. సమావేశానికి మూడు వందల మంది వరకు పార్టీ ప్రతినిధులకు ఆహ్వానం అందింది. దాదాపుగా అందరూ టిఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు ఉన్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు,వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నేపధ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని సంస్థాగతముగా బలోపేతం చేయడంతో పాటు వరుస ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ సీఎం అంటూ జరుగుతున్న ప్రచారంపై సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇస్తారా ? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ పర్యటన తర్వాత టిఆర్ఎస్ పార్టీ రాజకీయ వైఖరిపై నేతలకు కేసీఆర్ స్పష్ఠత ఇస్తారా ? అనేది తెలియాల్సి ఉంది…
టీఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా పార్టీ ముఖ్య నేతలు, మంత్రి కేటీఆర్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులతో భేటీ అయ్యారు. సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్‌ వారితో చర్చిస్తున్నారు