నల్గొండ జిల్లాలో ఒక్కో పంచాయతీకి రూ.20లక్షలు కేటాయిస్తున్నట్లు.. సీఎం కేసీఆర్ ప్రకటన….

నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటనలు చేశారు. జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉండగా.
. ఒక్కో పంచాయతీకి రూ.20లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మండల కేంద్రానికి రూ.30లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5కోట్లు ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధుల విడుదలకు సంబంధించి రేపు(గురువారం) జీవో విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
నెల్లికల్లులోని భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, త్వరలోనే కొత్త పెన్షన్‌లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన నల్గొండ జిల్లా చాలా నష్టపోయిందని సీఎం వివరించారు. ఇదిలా ఉండగా, నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించడంపై వెనుక కేసీఆర్ వ్యుహం ఉందని అందరూ అనుకుంటున్నారు. త్వరలో జరిగే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు కోసమే ముఖ్యమంత్రి జిల్లావాసులకు ప్రత్యేక వరాలు ప్రకటించినట్లు అంతా గుసగుసలాడుకుంటున్నారు.
ఎత్తిపోతలకు రూ.2,500కోట్లు.. నల్గొండకు రూ.186కోట్లు
హాలియా టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా అభివృద్ధికి రూ.186కోట్లు ప్రకటించారు. జిల్లాలోని పెండింగ్ లిఫ్ట్ ప్రాజెక్టుల పూర్తికి రూ.2500 కోట్లు ఇస్తానన్నారు. ఏడాదిలోగా లిఫ్టులు పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లే కదా జిల్లాకు ఈ గతి పట్టిందన్నారు. తమ ప్రాజెక్టులన్నీ కమీషన్ కోసం కడుతున్నామని ఎద్దేవా చేస్తున్నారు.. మరి నాగార్జున సాగర్ కూడా కమీషన్ కోసమే కట్టారా..? అని కాంగ్రెస్ నాయకులను తూర్పారాబట్టారు. ఇక బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. మేము తలుచుకుంటే మీరు దుమ్ము దుమ్ము అయిపోతారని.. తమ దేమీ ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని ఫైర్ అయ్యారు..