ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని అటవీ భూములను రక్షించి తీరాలి..గంజాయి సాగుచేస్తే అన్ని సౌకర్యాలు బంద్‌… సీఎం కేసీఆర్..

ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని అటవీ భూములను రక్షించి తీరాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే ఏం లాభం? అడవులను రక్షించుకొంటేనే భవిష్యత్తు తరాలకు మేలు చేసినవారమవుతాం. దట్టంగా ఉన్న అడవులను రక్షించుకోవాలి. ఆక్రమణలు తొలగించి, ఉద్దేశపూర్వకంగా అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..పోడు భూముల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. నవంబర్‌ ఎనిమిది నుంచి డిసెంబర్‌ 8 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పోడు సమస్య పరిష్కారంలో అడవిబిడ్డలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోడు సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షించి దట్టమైన అడవులు పెరిగేలాచేయాలని సూచించారు. అడవులను నాశనం చేసే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదుచేయాలని జిల్లాల కలెక్టర్లు, అటవీ, పోలీస్‌శాఖ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ, పునర్జీవం, హరితహారంపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్‌, పంచాయతీరాజ్‌శాఖల ఉన్నతాధికారులతో శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు, గ్రామ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు..ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని అటవీ భూములను రక్షించి తీరాలని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే ఏం లాభమని ఆవేదన వ్యక్తంచేశారు. అడవులను రక్షించుకొంటేనే భవిష్యత్తు తరాలకు మేలు చేసినవారమవుతామని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు…

గంజాయి సాగుచేస్తే అన్ని సౌకర్యాలు బంద్‌
గంజాయి సాగుచేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా, విద్యుత్తు సౌకర్యం నిలిపివేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గంజాయి సాగుచేసేవారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖకు సూచించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టా రద్దుచేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు, ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టి తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.