మీ బిడ్డగా, కేసీఆర్‌గా నేను మనవి చేస్తున్నా. చింతించాల్సిన అవసరం లేదు. 4 తర్వాత ఈ పథకాన్ని ఎవడూ ఆపలేడు…సీఎం కెసిఅర్

హుజూరాబాద్ లో దళితబందు

4 తర్వాత బాజాప్తా అమలు చేస్తాం
ఎన్నికల కమిషన్‌ ఆపగలిగేది అప్పటి వరకే
ఆ తర్వాత ఆపడం ఎవరి తరమూ కాదు
రెండు నెలల్లో వందశాతం పూర్తవుతుంది

మీ బిడ్డగా చెప్తున్నా.. ఎవరూ చింతించొద్దు
గెల్లును గెలిపిస్తరు.. దీవిస్తరు.. నాకు తెలుసు
శ్రీనివాసే ఎమ్మెల్యేగా వచ్చి పంపిణీ చేస్తడు
118 నియోజకవర్గాలకు మీరే ఆదర్శం
టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌

‘నవంబర్‌ 4 తర్వాత యుద్ధప్రాతిపదికన హుజూరాబాద్‌లో దళితబంధు అమలవుతుంది.

మీ బిడ్డగా, కేసీఆర్‌గా నేను మనవి చేస్తున్నా. చింతించాల్సిన అవసరం లేదు. 4 తర్వాత ఈ పథకాన్ని ఎవడూ ఆపలేడు. బాజాప్తా మీ స్కీం మీకు అమలవుతుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను మీరే గెలిపిస్తరు.. దీవిస్తరు. ఆ విషయం నాకు తెలుసు. 4వ తేదీన శాసనసభ్యుడిగా వచ్చి గెల్లు శ్రీనివాసే దళితబంధును పూర్తిచేస్తరు’ అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. సోమవారం టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

నవంబర్‌, డిసెంబర్‌లో పూర్తి హుజూరాబాద్‌ బిడ్డలకు నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా. ముఖ్యంగా దళిత బిడ్డలకు.. మీరు అదృష్టవంతులు. మీ దగ్గరికి దళితబంధు పైలట్‌ ప్రాజెక్టు వచ్చింది. ఎన్నికల కమిషన్‌ ఏం చేసినా.. నవంబర్‌ 4 తర్వాత దాన్ని ఎవడూ ఆపలేడు. బాజాప్తా మీ స్కీం మీకు అమలవుతుంది. ఎన్నికల కమిషన్‌ ఆపగలిగేది నవంబర్‌ 4 వరకే. నవంబర్‌, డిసెంబర్‌లో హుజూరాబాద్‌లో యుద్ధ ప్రాతిపదికన దళితబంధు అమలు పూర్తిచేస్తాం. అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న గెల్లు శ్రీనివాస్‌ను మీరే గెలిపిస్తరు.. దీవిస్తరు. ఆ విషయం నాకు తెలుసు. 4వ తేదీన శాసనసభ్యుడిగా వచ్చి గెల్లు శ్రీనివాసే దళితబంధును పూర్తిచేస్తరు. మీ ఒక్క నియోజకవర్గం పక్కనపెడితే మిగిలిన 118 నియోజకవర్గాల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు, దళితబంధు కమిటీలు జనవరిలో మీ హుజూరాబాద్‌ నియోజవర్గానికే వస్తారు. మీరు దళితబంధును ఎట్లా అమలు చేశారో? ఎట్లా విజయవంతం చేస్తున్నరో? మీ హుజూరాబాద్‌ నుంచే నేర్చుకుంటరు.

మార్చి తర్వాత రాష్ట్రమంతా.
రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రాంతాలకు మార్చి వరకు దళితబంధు పథకాన్ని విస్తరిస్తున్నాం. ఇప్పుడు నాలుగు నియోజకవర్గాలను తీసుకున్నాం. మార్చి తర్వాత రాష్ట్రమంతటా అమలు చేస్తం. రాష్ట్రంలోని హుజురాబాద్‌ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో మార్చిలోగా ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. మార్చి తరువాత వారందరికీ స్కీంను వర్తింపజేస్తాం. వందమంది లబ్ధిదారుల్లో రెండు గ్రామాలు, మూడు గ్రామాల్లోని వారిని ఎంపిక చేయవచ్చు. దీని ద్వారా కొత్త అనుభవాలు వస్తాయి. దళితబంధులో డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు. దళితులకు అన్ని రకాల లైసెన్స్‌లు ఇస్తాం. మెడికల్‌ షాపులు, ఫర్టిలైజర్‌ షాపులు, హాస్పిటల్స్‌, మద్యం షాపుల్లో, కాంట్రాక్టర్లలో కూడా కొన్నింటిని రిజర్వ్‌ చేస్తాం. హాస్టల్స్‌, హాస్పిటల్స్‌కు సరఫరా చేసే వాటిని వీరి ద్వారా సరఫరా చేస్తాం. ఈ పథకానికి నిబంధనలు కఠినంగా లేవు. పది లక్షలతోటి రెండు మూడు రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు కలిసి రూ.30 లక్షలతో కూడా వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా అమలు చేయడం ద్వారా వివక్షకు గురైన దళిత జాతిని మనమే బాగు చేసుకోవాలి.