కేంద్రం వడ్లు కొననంటోంది..వరి వెయ్యద్దు… సీఎం కేసీఆర్…

కేంద్రం వడ్లు కొననంటోంది..వరి వెయ్యద్దు… సీఎం కేసీఆర్.

రాష్ట్రంలో వరి వేయొద్దని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోందని, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. యాసంగిలో వరి వేయొద్దని కొద్ది రోజులు మంత్రులు, ప్రభుత్వంలోని కొందరు అధికారులు చేస్తున్న ప్రకటనలపై సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా ఇవాళ ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌‌ మాట్లాడుతూ..యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయాలని నిన్న వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలోని రైతులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరించబోమని చెబుతోంది కాబట్టి నష్టపోతామని ఇలా చెప్పాల్సి వచ్చింది. తెలంగాణ ఏర్పడక ముందు రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి. వలసలు భారీగా ఉన్నవి. రాష్ట్ర ఏర్పడి టీఆర్‌‌ఎస్ సర్కారు వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి, పల్లెలు అభివద్ధికి స్పష్టమైన పాలసీ తీసుకున్నాం. ఆ దిశలో అడుగుల వేశాం. శిథిలమైన చెరువలును మిషన్ కాకతీయ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేశాం. కరెంటు కొరత లేకుండా చేసుకున్నాం. ఎకరానికి 10 వేల రూపాయలు రైతు బంధు కింద ఇస్తున్నాం. రైతులకు బీమా పెట్టాం. ప్రీమియం కూడా ప్రభుత్వమే కడుతోంది. ఈ రెండు పథకాలు దేశంలోనే మనం మాత్రమే తెచ్చాం” అని చెప్పారు.

కరోనా టైమ్‌లో మొత్తం కొన్నాం

‘‘కల్తీ విత్తనాలను కట్టడి చేసేందుకు పీడీ యాక్ట్ తెచ్చాం. దేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణనే. దీనిని తెచ్చేందుకు కేంద్రంతో కొట్లాడాల్సి వచ్చింది. రాష్ట్ర ఏర్పడ్డాక మంచి విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెచ్చాం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. కరోనా లాంటి విపత్తకర పరిస్థితి వస్తే దాదాపు 6 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా వడ్లు కొన్నాం. రైతులను కడుపులో పెట్టి చూసుకోవాలన్న ఆశయంతో దేశంలోనే ఇలా పూర్తిగా వడ్లు కొన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం” అని సీఎం కేసీఆర్ చెప్పారు.

అది కేంద్రం బాధ్యత.. అయినా సమాధానం లేదు

‘‘దేశంలో ఆహారం కొరత రాకుండా చూసేందుకు కేంద్రం పరిధిలో ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటైంది. దీని కోసం దేశమంతా ధాన్యం నిల్వ చేసే గోడౌన్లు ఉన్నాయి. దేశంలో ధాన్యం నెలలు, ఏండ్ల తరబడి సైంటిఫిక్ పద్ధతుల్లో నిల్వ చేసే గోడౌన్లు ఒక్క కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనూ ఇలాంటివి లేవు. అట్లనే తెలంగాణలోనూ లేవు. ఆహార కొరత రాకుండా చూసే బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు కేంద్రంపై పెట్టారు. ఆ బాధ్యతను విస్మరిస్తూ ధాన్యం కొనుగోలు చేయబోమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్రాలు ధాన్యం సేకరణ చేసి భద్రం చేసే గోడౌన్లు లేవు. వాటిని ఎగుమతి చేసే అధికారం కూడా రాష్ట్రాలకు లేదు. ఇటీవల నేను ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడటానికి వెళ్తే.. ధాన్యం కొనుగోలు చేయబోమని ఖరాఖండీగా చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సాహించాలని సూచించారు. పంట మారిస్తే ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని చెప్పారు. తెలంగాణలో యాసంగిలో వరి పంట అంటే బాయిల్ చేయకతప్పదు. లేదంటే నూక ఎక్కువగా వచ్చి గిట్టుబాటు కాదు. కానీ కేంద్రం బాయిల్ రైస్ అస్సలు తీసుకోబోమని చెబుతోంది. భవిష్యత్తులో బాయిల్ రైస్ ఇవ్వము అని లిఖితపూర్వకంగా ఇస్తేనే గతంలో మొత్తం తీసుకుంటామని చెప్పారు. దీంతో తప్పలేదు. లిఖితపూర్వకంగా కేంద్రానికి హామీ ఇచ్చాం. ఈ సంవత్సరానికి ఎంత వరకు ధాన్యం కొనుగోలు చేస్తారని కేంద్రాన్ని అడిగితే.. అప్పటి నుంచి నేటి వరకూ సమాధానం లేదు” అని కేసీఆర్‌‌ తెలిపారు.