ఒకటే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా…కేంద్రంనుండి ఎన్ని నిధులు తెచ్చారు…తెలంగాణ ఉద్య‌మంలో నువ్వెక్క‌డ‌ “బండి సంజయ్”… సీఎం కేసీఆర్

ఒకటే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా
చేస్తా సీఎం కేసీఆర్

బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు పాసైన‌ప్పుడు కేసీఆర్ ఓటేయ‌లేదు అని బండి సంజయ్ అంటున్నాడు.

ఆయ‌న మాట‌లు వింటుంటే ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. తెలంగాణ ఉద్య‌మంలో నువ్వెక్క‌డ‌. నువ్వు ఎవ్వ‌నికి తెలుసు ఈ రాష్ట్రంలో. నీ ప‌త్తానే లేదు. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే న‌డ‌వ‌దు. క‌థ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వ‌దిలిపెట్ట‌ను. ప్ర‌తి రోజు మాట్లాడుతా. గార‌డీ చేస్తామంటే న‌డ‌వ‌నివ్వ‌ను. తెలంగాణ‌కు ఏం చేసినావో చెప్పు అంట‌డు ఈ మొగోడు. తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మం అందుతోంది. నీ ఇంటికి కూడా మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు వ‌స్తున్నాయి క‌దా?

దేశాన్ని న‌డిపే పార్టీ అధ్య‌క్షుడు.. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. గొర్రెల పైస‌ల్లో ఒక్క పైసా కేంద్రానిది ఉంద‌ని తేలితే నేను ఒక‌టే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాను. నేష‌న‌ల్ కో ఆప‌రేటివ్ బ్యాంక్ వ‌ద్ద గొర్రెల ప‌థ‌కానికి పైస‌లు అప్పుగా తీసుకున్నాం. వ‌డ్డీతో స‌హా తిరిగి క‌డుతున్నాం. నీవు ఇచ్చింది ఏం తోక‌. అబద్దాలు మాట్లాడ‌టం స‌రికాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో షాదీ ముబార‌క్, క‌ల్యాణ‌ల‌క్ష్మి, పెన్ష‌న్లు ఇస్తున్నారా? పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లపై మాట్లాడితే ప‌క్క దేశాల‌కు పోవాల‌ని అంటున్నారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అని కేసీఆర్ మండిప‌డ్డారు.

1.35 లక్షల ఉద్యోగాలిచ్చాం.. మీరేం చేశారు?: కేసీఆర్.

తాము నిరుద్యోగులకు అండగా ఉన్నామని, ఇప్పటి వరకూ లక్షా ముప్ఫైఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఏ వర్గానికి మేలు చేసిందో చెప్పాలని ఆ పార్టీకి సవాలు విసిరారు.
తమ పాలనలో నిరుద్యోగులకు ఇప్పటి వరకూ ఇచ్చిన ఉద్యోగాలే కాకుండా, మరో 70-80 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తాము గోల్‌మాల్‌ లెక్కలు చెప్పలేదని, రాష్ట్రాన్ని కష్టపడి తెచ్చుకున్నం, దాన్ని సవరించాలి అని ఆలోచించినట్లు కేసీఆర్‌ చెప్పారు.
దానికోసమే కొత్త జోనల్‌ చట్టాన్ని తీసుకొచ్చామని, దాన్ని ఆమోదించడానికి 6-7 నెలలు తమను సతాయించారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ చట్టం ఆవశ్యకతను వివరిస్తూ పదిసార్లు తిరిగితే ఇటీవల దానికి ఆమోదం లభించిందని తెలియజేశారు. ఈ చట్టం ప్రకారమే ఉద్యోగుల సర్దుబాటు చేస్తున్నామని వివరించారు.
‘పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు చేశాం. ప్రభుత్వ శాఖలన్నింటినీ రీఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం. మేం తెచ్చిన జోనల్‌ చట్టానికి మేమే వ్యతిరేకంగా పోలేం కదా. ఉన్న ఉద్యోగులంతా ఎక్కడి వారు అక్కడ అడ్జస్ట్ అయిన తర్వాత జిల్లాల వారీగా ఏ జిల్లా వారికి అక్కడే ఖాళీలు దొరుకుతాయి’ అని తెలియజేశారు.రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల యువకులకు ఎక్కడ ఉన్న వారికి అక్కడే ఉద్యోగాలు రావాలనే ఉద్దేశ్యంతోనే పరిపాలనా సంస్కరణలు, జోనల్‌ వ్యవస్థలు తెచ్చామన్నారు. ఉద్యోగుల అడ్జస్ట్‌మెంట్ పూర్తయితే ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తుందని, ఇటీవల తాము వేసిన అంచనా ప్రకారం 60-70 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
‘ఉద్యోగాల విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పా. చేయగలిగిందే చెప్తాం తప్ప గోల్‌మాల్‌ మాటలు మేం చెప్పం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని, ఏటా కోటి ఉద్యోగాలు నాశనం చేస్తూ వచ్చిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత ఎంత ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉంది? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.