ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం..

కేంద్రంతో వడ్లను కొనిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విశ్వప్రయత్నాలు...

తెలంగాణలో యాసంగి వడ్ల కొనుగోలుపై తుది నిర్ణయం ప్రధాన ఎజెండాగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. కేంద్రంతో వడ్లను కొనిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెరాస ఆధ్వర్యంలో అయిదంచెల ఉద్యమం జరిగింది. సోమవారం దిల్లీలో దీక్ష ముగింపు సందర్భంగా కేసీఆర్‌ మంత్రిమండలి సమావేశంపై నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సీఎం గడువు(డెడ్‌లైన్‌) విధించారు. లేకపోతే తామే ఓ నిర్ణయానికి వస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే మంత్రిమండలి సమావేశంపై అందరి దృష్టీ కేంద్రీకృతమయింది. ఇప్పటికే ధాన్యం సేకరణ సమస్య పరిష్కారంపై కేంద్రం నుంచి సానుకూలత లేనందున ప్రత్యామ్నాయాలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆహారశుద్ధి శాఖలను ఆదేశించారు. దీనిని ప్రభుత్వం మంగళవారం మంత్రిమండలికి సమర్పించే వీలుంది. ధాన్యం కొనుగోళ్ల విధానంపై మంత్రిమండలి ఉపసంఘం నిర్ణయాన్ని ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది.
….న్యాయ పోరాటంపై……
వడ్ల సేకరణపై ఒకవైపు రాజకీయ, ప్రభుత్వ ఒత్తిళ్లకు తోడు న్యాయపరంగానూ దీనిపై పోరాడాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. రైతులను ఆదుకునేందుకు పంజాబ్‌ తరహాలో కేంద్రమే వడ్లు కొనాలని, అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని హైకోర్టు, సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్‌ వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్రం చేతులెత్తేసిన పక్షంలో వడ్ల ఎగుమతులు, ఇథనాల్‌ ఇంధన ఉత్పత్తికి రాష్ట్రస్థాయిలో అనుమతులు తదితర అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. మంత్రిమండలిలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. వడ్ల కొనుగోలు సమస్యగా మారుతున్నందున వర్షాకాలం పంటలపై ఏం చేయాలనేదానిపైనా మంత్రిమండలి చర్చించనుంది. ‘ధాన్యం కొనుగోళ్లపై దేశవ్యాప్తంగా ఒకే విధానం’ అంశంపై దిల్లీలో అన్ని పార్టీల నేతలు, రైతుసంఘాల నాయకులు, ఆహారనిపుణులతో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించాలని తెరాస యోచిస్తోంది. మంత్రిమండలిలో అధికారిక ఎజెండా అనంతరం మంత్రులతో దీనిపై సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రిమండలిలో ధాన్యం సేకరణకు తోడు ఉద్యోగ నియామకాల రెండో దశకు ఆర్థికశాఖ అనుమతుల జారీ, నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లకు అనుమతులు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే వీలుంది. ఉద్యోగ నియామకాలకు మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ)ల ఎత్తివేత ప్రతిపాదనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

*గవర్నర్‌ అంశంపై…*

గవర్నర్‌తో విభేదాల అంశంపైనా మంత్రిమండలిలో చర్చకు రానుందని సమాచారం.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించనున్నారని తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.

*హైదరాబాద్‌కు సీఎం*

పదిరోజుల దిల్లీ పర్యటనను పూర్తిచేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నెల మూడో తేదీన దిల్లీకి వెళ్లిన సీఎం అక్కడ ఎంపీలతో సమావేశమై, పార్లమెంటులో ఆందోళనపై చర్చించారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌సింగ్‌ టికాయత్‌, ఇతర ప్రముఖులతోనూ చర్చలు జరిపారు. సోమవారం తెలంగాణభవన్‌ వద్ద నిరసన దీక్ష ముగిసిన వెంటనే సాయంత్రం 4గంటలకు దిల్లీ నుంచి బయల్దేరిన కేసీఆర్‌ ఆరు గంటలకు హైదరాబాద్‌ చేరుకున్నారు.

*ప్రత్యామ్నాయాలపై ప్రతిపాదనలు*

తెలంగాణలో సుమారు 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందన్నది అంచనా. ఇందుకు ప్రత్యామ్నాయాలు ఏమిటన్న అంశంపై మంత్రులు, అధికారుల స్థాయిలో తర్జనభర్జనలు సాగుతున్నాయి.

* ప్రభుత్వమే ధాన్యం కొని బహిరంగ మార్కెట్టులో వేలం వేయటం.. లేదా గతంలో మాదిరి సర్కారే ధాన్యం కొని మిల్లర్లకు ఇచ్చి సాధారణ బియ్యంగా మార్చి రాష్ట్ర అవసరాలకు పోను మిగిలింది భారత ఆహార సంస్థకు అందజెయ్యటం

* ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా సాధారణ బియ్యంగా మార్చిన పక్షంలో నూకలు ఎక్కువగా వస్తే క్వింటాకు రూ.170 నుంచి రూ.200 వరకు మిల్లర్లకు చెల్లించటం

* వేలం వేయాలన్నా, నూకల నష్టాన్ని మిల్లర్లకు ఇవ్వాలన్నా ప్రభుత్వం విధివిధానాలను రూపొందించాల్సి ఉన్నందున అందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయటం.