తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే అప్పుడు తెలంగాణ వచ్చింది.. సీఎం కేసీఆర్..
తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలేదు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవడో ఇవ్వలేదు మనకు.. పుణ్యానికి ఇచ్చిపోలేదు మనకు తెలంగాణను అని కేసీఆర్ పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల్లో మన హక్కు రావాలని పరిశోధన చేశామని కేసీఆర్ తెలిపారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇక్కడున్న కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు.. వారికి నోరు లేక, అడగలేక జూరాల నుంచి నీళ్లు తీసుకోమని ఇచ్చారు. జూరాల బెత్తడు ప్రాజెక్టు. దాంట్ల నీళ్లు ఉండేదే 9 టీఎంసీలు. మనం తీసుకునేది 2 టీఎంసీలు ఒక దినానికి. అలా తీసుకుంటే మూడు రోజులకు ఖతం అయిపోతది. మళ్లా నీళ్లు ఎక్కడ్నుంచి తీసుకోవాలి. మళ్లా ఒక్కసారి గోల్ మాల్ చేయడానికి ఆంధ్రా ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టారు. నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకుంటం.. నాకర్థం కాదు అని ప్రశ్నించాను. శ్రీశైలం వాని అయ్య జాగీరా..? దాంట్ల మన పైసలు లేవా..? బాజాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాలని చెప్పి.. నేను అధికారులందరికీ చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చాం. ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు. ఈ జిల్లాలో ఎట్ట పుట్టారో కూడా తెల్వదు. వాళ్లు మాట్లాడుతారు ఇప్పుడు కూడా.. జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండే అని.. సిగ్గుపడాలి.. మీకు ఏమన్నా తెలివి ఉన్నదా..? జూరాలలో నీళ్లు ఎన్ని ఉన్నాయో తెలుసా.? ఎన్ని రోజులకు వస్తాయో తెలుసా..? అంటే ఆ రోజు భావదారిద్రమే.. ఉద్యమం చేస్తుంటే భావదారిద్రమే.. ఇవాళ కూడా అదే భావదారిద్రమే అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
60 ఏండ్లు గోసపడ్డాం.. సర్వనాశనం అయిపోయాం..
ఇవాళ ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి.. నేను చెప్పే మాట గంభీరమైన మాట అని కేసీఆర్ అన్నారు. చిన్న పొరపాటు జరిగింది 1956లో. చాలా చిన్నపొరపాటు.. మనల్ని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేశారు. 60 ఏండ్లు గోస పడ్డాం. సర్వనాశనం అయిపోయాం. ముంబై బస్సులకు పాలమూరు ఆలవాలమైంది. తాలుకాలకు తాలుకాలు ఖాలీ అయ్యాయి. లంబాడీ బిడ్డలు హైదరాబాద్‌కు ఇంకో చోటకు బతుకపోయిన పరిస్థితి. ఆనాడు మనం కండ్లారా చూశాం. బాధలు పడ్డాం అని కేసీఆర్ తెలిపారు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్సే..
గోరెటి వెంకన్న ఇదే జిల్లా కవి.. పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే పాలమూరులోనా అని పాటలు రాశారు అని కేసీఆర్ గుర్తు చేశారు. పల్లె పల్లెల్లో పల్లేర్లు మొలవాల్నా..? మన జీవితం అదేనా..? దానికోసమే పుట్టామా అని ఆనాడు పిడికిలి ఎత్తి పోరాటం చేస్తే మీరందరూ దీవెన ఇస్తే, అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి వ్వలేదు. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలేదు. ఎవడో ఇవ్వలేదు మనకు.. పుణ్యానికి ఇచ్చిపోలేదు మనకు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ.. 60 ఏండ్లు మనల్ని గోసపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం ధ్వజమెత్తారు.
కరువు అనేది మనదిక్కు కన్నెత్తి కూడా చూడదు..
మనం పాలమూరు ఎత్తిపోతల ప్రారంభించుకున్నాం.. దానికి మళ్లా ఎవడు అడ్డం.. ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు, కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు వేస్తరని కేసీఆర్ మండిపడ్డారు. అది కావొద్దు.. అది అయితే లక్ష్మారెడ్డికి, శ్రీనివాస్ గౌడ్‌కు పేరు వస్తది. కేసీఆర్‌కు పేరు వస్తదని అడ్డు పడుతున్నారు. మొండిపట్టుతో పోయాం. ఈ మధ్యనే.. 9 సంవత్సరాల పోరాటం తర్వాత అనుమతులు వస్తున్నాయి. ధర్మం గెలుస్తది. న్యాయం గెలుస్తది. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండపూర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. మోటార్లు బిగిస్తున్నారు. మూడు నాలుగు నెలల్లో నీళ్లు చూడబోతున్నాం. పాలమూరు కరువు పోతది. ఉద్ధండపూర్ పూర్తయితే.. జడ్చర్ల సస్యశ్యామలం అవుతుంది. జడ్చర్లలో లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కరువు అనేది మనదిక్కు కన్నెత్తి కూడా చూడదు. సస్యశ్యామలం కాబోతుంది అని కేసీఆర్ తెలిపారు..
మమబూబ్‌నగర్ జిల్లా విషయానికి వస్తే.. గత ఉద్యమ సందర్భంలో ఏ మూలకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఎప్పుడు కూడా నేను దుఃఖంతో పోయేదని కేసీఆర్ గుర్తు చేశారు. కండ్లలో నీళ్లు వచ్చేవి. మహబూబ్‌నగర్ దరిద్రం పోవాలంటే ఎంపీగా పోటీ చేయాలని జయశంకర్ చెప్పారు. నేను ఇదే జిల్లా నుంచి పోటీ చేశాను. లక్ష్మారెడ్డి ముందుండి ఆ పార్లమెంట్ ఎన్నిక తన భుజాల మీద వేసుకుని ఎంపీగా గెలిపించారు. ఏ రోజుకైనా మహబూబ్‌నగర్ చరిత్రలో ఒక కీర్తి శాశ్వతంగా ఉంటుంది. పదిహేను ఏండ్లు పోరాటం చేసినప్పటికీ ఎంపీగా ఉంటూనే తెలంగాణ సాధించిన విషయం కూడా చిరస్థాయిగా ఉంటుంది. ఒకనాడు జయశంకర్ నేను నారాయణపేట నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు నవాబ్‌పేట అడవీ మీదుగా మహబూబ్‌నగర్ వస్తున్నాం. లైట్ల వెలుతురులో కనబడే చెట్లను చూసి మేం అనుకున్నాం. మనషులు కాదు చివరకు మభహబూబ్‌నగర్ చెట్లు కూడా బక్కపడిపోయాయని అనుకుని బాధపడ్డాం. ఒక్క గోస కాదు పాలమూరుది. అనక సందర్భాల్లలో కండ్లకు నీళ్లు వచ్చేవి. నడిగడ్డకు పోయినా నాడు కూడా ఏడ్సినం అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెల్లో బాధ కలిగేది అని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా పక్కనే పారుతున్నా.. ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం, శిలాఫలకాలు వేయడం తప్ప ఏం లాభం జరగలేదు. ఉద్యమంలో నేనే పాట రాసినా.. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు పంటలు ఎండే అని పాట కూడా రాశాను. మీ అందరికి తెలుసు. మహబూబ్‌బ్‌నగర్ నా గుండెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దుఃఖం, బాధ పేదరికం ఉన్నది. ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి మంత్రి అయ్యారు. చాలా పనులు చేశారు. ఇవాళ రాష్ట్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్లు ఆయన పుణ్యమే అని కేసీఆర్ తెలిపారు.