గిరిజన బంధు తప్పకుండా అమలు చేస్తాం సీఎం కేసీఆర్..

దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధు తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు

దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధు తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్(cm KCR)పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ రాక ముందు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించింది. నాకన్న దొడ్డుగా, ఎత్తుగా ఉన్నవారు ముఖ్యమంత్రులు అయ్యారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సరిపోదు. కనీసం మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేదు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ఈ భూభాగానికి మంచినీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు. లంబాడీ బిడ్డలు మా తండాలో మా రాజ్యం కావాలంటే పట్టించుకోలేదు. ఈ నియోజకవర్గంలో 49 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. అదే విధంగా గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంచుకున్నాం. దళితబంధు మాదిరిగానే గిరిజన బిడ్డలు కూడా భూమి, ఉద్యోగం లేకుండా ఉంటే వారికి కూడా గిరిజన బంధు ఇస్తామని చెప్పాం. తప్పకుండా అమలు చేస్తాం. ఇవాళ దళిత సమాజం బిడ్డలు ఆలోచించాలి. ఎవ్వడన్న ఈ దేశంలో ఏ ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అయినా దళితుల గురించి ఆలోచించారా? దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. దళితబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్. విడతల వారీగా మీ అందరికి దళితబంధు వస్తుందని కేసీఆర్ తెలిపారు.

పాలకుర్తికి ఇంజినీరింగ్ కాలేజీ ఉరికి ఉరికి వస్తది. గ్రామానికి 100 నుంచి 150 ఇండ్లు మొదటి రెండేండ్లలో మంజూరు చేస్తాం. అన్ని వాగుల మీద చెక్‌డ్యాంలు కట్టారు. భూగర్భజలాలు పెరిగాయి. కాంగ్రెస్ పాలనలో చివరకు పశువులకు గడ్డి లేకపోతే కబేళాలకు అమ్ముకున్న పరిస్థితి. మంచినీళ్లు, సాగునీళ్లకు ఇబ్బందులు. కరెంట్ కష్టాలు ఉండే. రాత్రిపూట బావుల వద్దకు రైతులు వెళ్తే పాములు కరిచి చచ్చిపోవుడు. ఆ బాధలన్నీ పోయాయి. ఇప్పుడిప్పుడే ముఖం తెలివి అయితా ఉన్నాం. ఈ ముఖం తెలివయ్యే తెలంగాణ మరింత తెలివికి రావాలి. మళ్లీ వెనక్కి పోవద్దు అని కేసీఆర్ పేర్కొన్నారు.

పాలకుర్తిలో ఏం జరుగుతుందో తెలుసు నాకు.. అమెరికా నుంచి విమానంలో వచ్చి ఐదు రోజు మురింపించేటోడు మనకు కిరీటం పెడుతారా..? టోపీ పెట్టి మళ్లీ విమనాం ఎక్కుతారు. పొద్దున్నుంచి రాత్రి వరకు మీ మధ్యలో ఉండే వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. 30న యువకులు దయచేసి ప్రతి ఒక్క ఓటు పోల్ చేయించాలి. ఇది పోరాటాల పురిటి గడ్డ.. దైవభక్తి ఉన్న గడ్డ, పోతన పుట్టిన గడ్డ, బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ పాలకుర్తి గడ్డ.. మీరంతా పోరాటానికి వారసులు. ఎర్రబెల్లి దయాకర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి అని కేసీఆర్ కోరారు.